[1] నేను ఇలా అనుకొన్నాను: “నా మాటలలో తప్పిదం చేయకుండా నా జీవిత విధానాన్ని జాగ్రత్తగా చూచుకుంటాను. దుర్మార్గులు దగ్గర ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను.”
[2] నేను మౌనం వహించి ఊరుకొన్నాను. మంచి సంగతులు కూడా మాట్లాడలేదు. కాని, నా బాధ అధికతరమైంది.
[3] నాకు గుండెలో మంట రగులుకొంది. తలపోసుకుంటూ ఉంటే తాపం ఎక్కువైంది. అప్పుడు నోరు తెరచి మాట్లాడాను.
[4] యెహోవా! నా అంతం గురించి నాకు తెలియజేయి. నేనెంతకాలం బ్రతుకుతానో, ఎప్పుడు గతించిపోతానో తెలుసుకోవాలని ఉన్నాను.
[5] నా బ్రతుకును నీవు బెత్తెడంతగా చేశావు. నేను జీవించేకాలం నీ దృష్టిలో ఏమీ లేనట్టే! మనిషి అన్న తరువాత అతడు కేవలం ఊపిరిలాగా ఉన్నాడు అంతే! (సెలా)
[6] అటూ ఇటూ తిరుగాడే మనుషుల ఉనికి నీడలాంటిదే. సందడిగా ఉన్నవాళ్ళు ప్రయత్నాలన్నీ గాలి మాత్రానికే! మనిషి ధనం పోగు చేస్తాడు గాని అది ఎవరి పాలవుతుందో తెలియదు.
[7] ప్రభూ! నేను దేనికోసం ఎదురు చూస్తున్నట్టు? నా ఆశాభావం నీలోనే!
[8] నా అతిక్రమ కార్యాలన్నిటినుంచీ నన్ను విడిపించు. బుద్ధీ భక్తీ లేనివాళ్ళ ఎదుట నన్ను నిందలపాలు కానియ్యకు.
[9] జరిగినదానిని నీవే జరిగించావు గనుక నా నోరు తెరవకుండా మౌనం వహిస్తున్నాను.
[10] నన్ను దెబ్బలు కొట్టడం మానుకో. నీ చేయి చేసిన గాయాలవల్ల నేను చచ్చిపోతున్నాను.
[11] పాపాల కారణంగా నీవు మనిషిని చీవాట్లు పెట్టి శిక్షిస్తావు. చిమ్మటలు బట్ట కొట్టినట్టు నీవు అతడి ప్రియమైన వాటిని చెడగొట్టివేస్తావు. మనిషి అన్న తరువాత అతడు కేవలం ఊపిరిలాగా ఉన్నాడు అంతే! (సెలా)
[12] యెహోవా, నా ప్రార్థన విను! నా మొర చెవినిబెట్టు! నా కన్నీళ్ళు చూచి ఊరుకోబోకు. నేను నీ అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేనూ పరదేశిని.
[13] ఇంకా నామీద దృష్టి మరలించుకో! నేను లేకుండా పొయ్యేముందు నాకు సంతోషం కలగనియ్యి.