Skip to content
Opens in a new window

[1] యెహోవా, నా దేవా! నిన్ను శరణు జొచ్చినవాణ్ణి. నన్ను రక్షించు, నన్ను హింసకు గురి చేసే వాళ్ళ బారినుండి తప్పించు.

[2] నన్ను తప్పించడానికి ఎవరూ లేకపోతే, వాళ్ళు సింహాలలాగా నా పైకి లంఘించి, నన్ను చీల్చి చెండాడుతారు.

[3] యెహోవా, నా దేవా! నా చేతులు చెడ్డవైతే,

[4] నా మిత్రుడు చేసిన మేలుకు నేను కీడు చేసివుంటే, నామీద పగపట్టిన వాళ్ళను నిష్కారణంగా దోచుకొని ఉంటే,

[5] అలాంటప్పుడు నా శత్రువులను నా పై అలాగే పడనియ్యి. నన్ను పట్టుకొని నేలకు పడదొక్కనియ్యి. నా బ్రతుకును, నా పేరు ప్రతిష్ఠలను మంటగలపనియ్యి. (సెలా)

[6] యెహోవా! నా శత్రువుల ఆగ్రహాన్ని చూచి కోపంతో లే! న్యాయం జరగాలని నిర్ణయించావు. నా దేవా, ఆవేశంతో లే.

[7] జనాలు నీ చుట్టు గుమికూడి ఉండగా, వాళ్ళకు పైగా ఆసీనుడవు కావడానికి మళ్ళీ రా.

[8] యెహోవా జనాలకు తీర్పు తీరుస్తాడు. యెహోవా! నా న్యాయ ప్రవర్తన, నిజాయితీ ప్రకారం నాకు న్యాయం చేకూర్చు.

[9] దుర్మార్గుల చెడుతనాన్ని అరికట్టు. సన్మార్గులను సుస్థిరం చెయ్యి. న్యాయవంతుడైన దేవుడు మనసునూ హృదయాన్నీ పరిశోధిస్తున్నవాడు.

[10] దేవుడు యథార్థ హృదయులను కాపాడుతున్న వాడు. ఆయనే నన్ను సంరక్షిస్తున్న డాలులాంటివాడు.

[11] దేవుడు న్యాయంగా తీర్పును తీరుస్తాడు. ఆయనకు కోపం ప్రతి రోజూ వస్తుంది.

[12] వాళ్ళు ఆయన వైపు తిరగకపోతే ఆయన తన కత్తి పదును చేస్తాడు. ఆయన విల్లు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నాడు.

[13] తన మరణాయుధాలను తయారు చేశాడు. తన అగ్ని బాణాలను సిద్ధం చేశాడు.

[14] దుర్మార్గుడు చెడుగుతో ప్రసవ వేదన పడుతున్నాడు. వాడి కడుపులో ఉన్నది కీడు. కనేది మోసం.

[15] వాడు గోతిని తవ్వాడు లోతుగా. తాను చేసిన గుంటలో తానే పడతాడు.

[16] వాడు చేసిన కీడు వాడి తల మీదికే వస్తుంది. వాడు ఉద్దేశించిన దౌర్జన్యం వాడి నడినెత్తిమీదే పడుతుంది.

[17] నేను యెహోవా న్యాయాన్ని ఉద్దేశించి ఆయనకు కృతజ్ఞత అర్పిస్తాను. సర్వాతీతుడైన యెహోవా పేరును కీర్తిస్తాను.

కీర్తనలు — Chapters