[1] నా మనసా, యెహోవాను కీర్తించు. నాలో ఉన్న సమస్తమా, ఆయన పవిత్రమైన పేరును కీర్తించు.
[2] నా మనసా, యెహోవాను కీర్తించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనినీ మరువకు.
[3] ఆయన నీ అపరాధాలన్నీ క్షమిస్తున్నాడు. నీ రోగాలన్నీ ఆయన పూర్తిగా నయం చేస్తున్నాడు.
[4] నాశనకరమైన గోతిలో నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేశాడు. అనుగ్రహమూ, వాత్సల్యమూ నీమీద కిరీటంగా ఉంచాడు.
[5] మంచివాటితో నీ ఆశలను తృప్తిపరుస్తాడు. తద్వారా నీ యువత గరుడపక్షిలాగా కొత్తదనం సంతరించుకొంటుంది.
[6] యెహోవా యుక్తమైన క్రియలు జరిగిస్తాడు. హింసకు గురి అయిన వారందరికీ ఆయన న్యాయం చేకూరుస్తాడు.
[7] ఆయన మోషేకు తన విధానాలు చూపాడు. ఇస్రాయేల్‌ప్రజలకు తన చర్యలు చూపాడు.
[8] యెహోవా దయగలవాడు, మృదుల వాత్సల్యం చూపేవాడు, త్వరగా కోపపడనివాడు, కరుణామయుడు.
[9] ఆయన ఎల్లప్పుడూ మనతో వాదించేవాడు కాడు. ఎల్లప్పుడూ కోపం పెట్టుకొనేవాడు కాడు.
[10] ఆయన మన పాపాలను బట్టి మనలను అంతగా దండించినవాడు కాడు. మన అపరాధాలను బట్టి ప్రతీకారం చేసినవాడు కాడు.
[11] భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తో తనంటే భయభక్తులున్న వారిమీద ఆయన కరుణ అంత ఎక్కువ.
[12] పడమటికీ తూర్పుకూ మధ్య దూరమెంతో మన అతిక్రమాలను కూడా మననుంచి అంత దూరం చేశాడాయన.
[13] తండ్రి తన పిల్లలను జాలితో చూచినట్టు యెహోవా తనపట్ల భయభక్తులు గలవారిని కూడా జాలితో చూచుకుంటాడు.
[14] మన స్వభావం ఎలాంటిదో ఆయనకు తెలుసు. మనం మట్టివాళ్ళమని ఆయనకు జ్ఞాపకం.
[15] మనిషి రోజులు గడ్డిలాంటివి. వికసించే అడవిపువ్వులాగా అతడు ఉన్నాడు.
[16] దాని మీద గాలి వీచిందీ అంటే అది ఇంక ఉండదు. అది ఉన్న చోటుకు అదేదో తెలియకుండా అయిపోతుంది.
[17] కానీ తన ఒడంబడిక పాటించి, తన ఆదేశాల ప్రకారం ప్రవర్తించడానికి వాటిని మనసులో ఉంచుకొన్నవారికి తరతరాలుగా యెహోవా నీతిన్యాయాలు ఉంటాయి.
[18] తనంటే ఎవరికీ భయభక్తులున్నాయో వారిని ఆయన శాశ్వతంగా అనుగ్రహంతో చూస్తాడు.
[19] యెహోవా పరలోకంలో తన సింహాసనం సుస్థిరంగా నెలకొల్పాడు. ఆయన రాజ్యం విశ్వాన్ని పరిపాలిస్తూ ఉంది.
[20] యెహోవా దూతలారా! ఆయన ఆజ్ఞలను శిరసావహించి, వాటి ప్రకారం పని చేసే బలాఢ్యులైన మీరంతా యెహోవాను కీర్తించండి.
[21] యెహోవా సైన్యాల్లారా! ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా యెహోవాను కీర్తించండి.
[22] యెహోవా సర్వ పరిపాలన క్రింద ఉన్న ఆయన సర్వ సృష్టమా! యెహోవాను కీర్తించండి. నా మనసా! యెహోవాను కీర్తించు!