[1] ఆకాశాలు దేవుని మహత్తును గురించి చెపుతున్నాయి. విశాలమైన అంతరిక్షం ఆయన చేతులతో చేసిన పనిని తెలియజేస్తూ ఉంది.
[2] ప్రతి పగలూ ప్రబోధం చేస్తుంది. ప్రతి రాత్రీ జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.
[3] వాటికి భాషా, మాటా లేవు. వాటి స్వరం వినిపించడం లేదు.
[4] అయినా వాటి సందేశం లోకమంతటా, వాటి ప్రకటనలు భూమి కొనలకు చేరాయి. ఆకాశంలో సూర్యగోళానికి ఆయన డేరా వేశాడు.
[5] సూర్యగోళం పెళ్ళికొడుకులాగా తన మంటపంలో నుంచి బయటకి వచ్చినట్టు ఉంది, పందెంలో పరిగెత్తడానికి ఉత్సాహం గల బలాఢ్యుడిలాగా ఉంది.
[6] ఆకాశంలో ఈ చివరనుంచి అది తరలి వెళ్తూ ఆ చివర వరకు చుట్టు తిరుగుతుంది. దాని వేడినుంచి ఏదీ దాగుకోవడం అసాధ్యం.
[7] యెహోవా ఇచ్చిన ఉపదేశం లోపం లేనిది. అది ఆత్మకు జీవం తెస్తుంది. యెహోవా శాసనాలు నమ్మతగ్గవి. అవి మందబుద్ధులను తెలివైనవారుగా చేస్తాయి.
[8] యెహోవా ఆదేశాలు న్యాయమైనవి. అవి హృదయానందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశమానమైనవి. అవి కన్నులలో కాంతి కలిగిస్తాయి.
[9] యెహోవాను గురించిన భయభక్తులు శుద్ధమైనవి. అవి శాశ్వతంగా నిలుస్తాయి. యెహోవా న్యాయ నిర్ణయాలు కేవలం సత్యమైనవి, ధర్మసమ్మతమైనవి.
[10] బంగారం కంటే, చాలా మేలిమి బంగారంకంటే అవి ఎంతో అమూల్యమైనవి. తేనెకంటే, జుంటితేనె ధారాలకంటే అవి ఎంతో మధురం.
[11] నీ సేవకుడికి వాటి మూలంగా హెచ్చరిక కలుగుతుంది. వాటిని పాటించడం వల్ల గొప్ప బహుమానం దొరుకుతుంది.
[12] తెలియక చేసిన తన తప్పిదాలు తెలుసుకోగలవాడెవడు? నేనెరగని నా తప్పులు క్షమించి నిర్దోషినని తీర్పు తీర్చు.
[13] అహంభావ క్రియలు నీ సేవకుడైన నేను చేయకుండేలా నన్ను కాపాడు. అలాంటి అపరాధాలను నా మీద పెత్తనం చెయ్యనియ్యవద్దు. అప్పుడు నేను నిర్దోషిగా ఉంటాను. ఘోర పాతకం చెయ్యకుండా నిరపరాధిగా ఉంటాను.
[14] యెహోవా, నా ఆధారశిలా! నా విమోచకా! నా నోట వెలువడే మాటలూ, నా హృదయాలోచనలూ నీ దృష్టికి అంగీకారంగా ఉంటాయి గాక!