Skip to content
Opens in a new window

[1] జనాలు అల్లరి చేస్తున్నాయెందుకని? ప్రజలు వృధాలోచనలు చేయడం దేనికి?

[2] భూరాజులు యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ వ్యతిరేకంగా నిలుచున్నారు, పరిపాలకులు కలిసి కుట్ర పన్నుతున్నారు.

[3] “వారి బంధకాలను తెగతెంచుకొందాం. వారి కాడిని మననుంచి తీసి పారేద్దాం” అంటారు.

[4] పరలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడు నవ్వుతున్నాడు. ప్రభువు వాళ్ళను చూచి ఎగతాళి చేస్తున్నాడు.

[5] అప్పుడు కోపంగా వాళ్ళతో మాట్లాడతాడు. తన ఆగ్రహంతో వాళ్ళను భయకంపితులను చేస్తాడు.

[6] “నేను ఎన్నుకొన్న రాజును సీయోను అనే నా పవిత్ర పర్వతం మీద సింహాసనమెక్కించాను” అంటాడు.

[7] “యెహోవా నిర్ణయాన్ని తెలియజేస్తాను. ఆయన నాతో చెప్పాడు, నీవు నా కుమారుడవు, ఈ రోజున నిన్ను కన్నాను.

[8] నన్నడుగు, లోకంలోని అన్ని జనాలను నీకు వారసత్వంగా నీ వశం చేస్తాను. భూదిగంతాలను కూడా నీకు సొత్తుగా ఇస్తాను.

[9] ఇనుప దండంతో వాటిని తుత్తునియలు చేస్తావు. కుండను పగలగొట్టినట్టు వాటిని ముక్కచెక్కలు చేస్తావు.”

[10] కనుక రాజులారా! తెలివి తెచ్చుకొని మసలుకోండి. పరిపాలకులారా! హెచ్చరిక పొందండి.

[11] భయభక్తులతో యెహోవాను సేవించండి, వణకుతూ ఆనందించండి.

[12] దేవుని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపగిస్తాడు, మీకు నాశనం ప్రాప్తిస్తుంది. ఆయన కోపాగ్ని త్వరగా రగులుకోగలదు. ఆయనను నమ్మి ఆశ్రయించేవారంతా ధన్యులు.

కీర్తనలు — Chapters