[1] భూమి, దానిమీద ఉన్నదంతా యెహోవాకు చెందినవే. లోకమూ, అందులో ఉన్నవారూ కూడా ఆయన సొత్తే.
[2] ఎందుకంటే భూమిని సముద్రాల పై నిలిపినవాడు, ప్రవాహాల మీద దానిని సుస్థిరం చేసినవాడు ఆయనే.
[3] యెహోవా కొండపైకి ఎక్కిపోగల హక్కు ఎవరికి ఉంది? ఆయన పవిత్ర స్థానంలో ఎవరు నిలిచి ఉండగలరు?
[4] నిరపరాధమైన చేతులూ శుద్ధ హృదయమూ కలిగి వ్యర్థమైన వాటిని ఆశించకుండా, మోసకరంగా ఒట్టు పెట్టుకోనివారే అందుకు తగినవారు.
[5] యెహోవా మూలంగా వారికి ఆశీస్సులు లభిస్తాయి. తమ రక్షకుడైన దేవుడు వారిని నిర్దోషులు అంటాడు.
[6] దేవుణ్ణి సమీపించగలవారు వీరే. యాకోబు యొక్క దేవా, నిన్ను వెదికేది ఇలాంటివారే. (సెలా)
[7] ద్వారాల్లారా బార్లాగా తెరుచుకోండి! పురాతనమైన తలుపులారా, పైకెత్తుకోండి! అప్పుడు ఘనుడైన రాజు లోపలికి వస్తాడు.
[8] ఘనుడైన ఈ రాజు ఎవరు? ఈయన మహా బలాఢ్యుడైన యెహోవా! యుద్ధశూరుడైన యెహోవా!
[9] ద్వారాల్లారా బార్లాగా తెరుచుకోండి! పురాతనమైన తలుపులారా, పైకెత్తుకోండి! అప్పుడు ఘనుడైన రాజు లోపలికి వస్తాడు.
[10] ఘనుడైన ఈ రాజెవరు? సేనల ప్రభువు యెహోవా. ఘనుడైన రాజు ఈయనే.