Skip to content
Opens in a new window

[1] దేవుడు, యెహోవాదేవుడు మాట్లాడుతున్నాడు. పొద్దు పొడిచే దిక్కునుంచి అది కుంకే దిక్కు వరకు లోక ప్రజలందరినీ పిలుస్తున్నాడు.

[2] ఏ లోపంలేని అందమైన సీయోను నగరంలో నుంచి దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.

[3] మన దేవుడు వస్తాడు. నిశ్శబ్దంగా ఉండడు. ఆయన ముందర దహించివేసే మంటలు బయలు దేరుతాయి. ఆయనచుట్టు తుఫాను గాలులు వీస్తున్నాయి.

[4] తన ప్రజలకు ఆయన తీర్పు చెప్పబోతున్నాడు. పైగా ఉన్న ఆకాశాలను పిలుస్తున్నాడు. భూమిని పిలుస్తున్నాడు.

[5] “నా భక్తులను అంటే, బల్యర్పణ మూలంగా నాతో ఒడంబడిక చేసుకొన్నవారిని నా దగ్గర సమకూర్చండి” అంటున్నాడు.

[6] ఆకాశాలు ఆయన న్యాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడే న్యాయమూర్తిగా కూర్చుని ఉన్నాడు. (సెలా)

[7] “నా ప్రజలారా! వినండి. నేను మాట్లాడబోతున్నాను. ఇస్రాయేల్‌ప్రజలారా! వినండి. మీ మీద సాక్ష్యం పలకబోతున్నాను. నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.

[8] మీ బలులను గురించి మీ మీద నేనేమీ కోపపడడం లేదు. మీరు సమర్పించే హోమాలు నా సమక్షంలో ఎల్లప్పుడూ కనిపిస్తున్నాయి.

[9] మీ ఇండ్లలోనుంచి ఎద్దు నాకక్కరలేదు. మీ మందలోనుంచి పొట్టేలు నాకవసరం లేదు.

[10] ఎందుకంటే అడవి మృగాలన్నీ నావే! వేలకొలది కొండలపై ఉన్న పశువులు నావే!

[11] కొండల మీద పక్షులన్నీ నాకు తెలుసు. పచ్చిక మైదానాలపై తిరిగేవన్నీ నావి.

[12] నాకు ఆకలైతే అది మీతో చెప్పను. ఈ లోకం, అందులోని సమృద్ధి అంతా నాదే!

[13] ఎద్దుల మాంసం నేను తింటానా? పొట్టేళ్ళ రక్తం నేను త్రాగుతానా?

[14] దేవునికి కృతజ్ఞతలు అర్పించండి. సర్వాతీతుడికి మీరు మ్రొక్కుకొన్నదేదో అర్పించండి.

[15] ఆపద సంభవించే రోజున నన్ను పిలువు. నీకు విడుదల ప్రసాదిస్తాను, నీవు నాకు మహిమ తెస్తావు.”

[16] దుర్మార్గుడితో దేవుడు చెపుతున్న మాట ఇదే: “నా శాసనాలు వివరిస్తున్నావేమిటి? నా ఒడంబడిక నీ నోట పలుకుతావేమిటి?

[17] క్రమశిక్షణ నీకు అసహ్యం గదా! నా మాటలను నీవు వెనక్కు నెట్టివేస్తావు గదా!

[18] దొంగ కనబడితే సరి, వాడి స్నేహంవల్ల నీకు సంతోషమే. వ్యభిచారం చేసేవాళ్ళకు నీవు బాగా పరిచయం!

[19] నీవు నోరు తెరిస్తే సరి, కీడు ఉట్టి పడుతుంది. నీ నాలుక మోసం కల్పిస్తుంది.

[20] ఇతరులతో కూర్చుని నీ సోదరుడిమీద లేనిపోనివి చెప్తావు. నీ తల్లికి అతడు కొడుకే గాని అతని మీద అపనిందలు వేస్తావు.

[21] నీవిదంతా చేశావు. అయినా నేను మౌనం వహించి సహించాను. గనుక నేనూ నీలాంటివాణ్ణే అనుకొన్నావు గదా. ఇప్పుడు ఈ విషయాన్ని నీ దృష్టికి తేటగా చూపుతాను, నిన్ను ఒప్పిస్తాను.

[22] దేవుణ్ణి మరిచిపోయేవారలారా, ఈ విషయం మనసుకు పట్టించుకోండి! లేదా, నేను మిమ్ములను ముక్కలుగా చీల్చివేస్తాను. మిమ్ములను కాపాడే వాడెవడూ ఉండడు.

[23] కృతజ్ఞతలు అర్పించేవాడు నన్ను గౌరవిస్తున్నాడు. దేవుని రక్షణ అతనికి నేను చూపెట్టేలా అతడు మార్గం సిద్ధం చేస్తున్నాడు.”

కీర్తనలు — Chapters