[1] యెహోవాను స్తుతించండి! యెహోవాకు క్రొత్త పాట పాడండి! భక్తుల సమాజంలో ఆయన స్తుతిగీతం పాడండి!
[2] ఇస్రాయేల్‌ప్రజలు తమ సృష్టికర్తను బట్టి ఆనందిస్తారు గాక! సీయోనుకు చెందినవారు తమ రాజును బట్టి సంతోషిస్తారు గాక!
[3] నాట్యం చేస్తూ ఆయన పేరును స్తుతిస్తారు గాక! కంజరితోనూ తంతివాద్యంతోనూ గానం చేస్తారు గాక!
[4] తన ప్రజలంటే యెహోవాకు ఆనందం. దీనావస్థలో ఉన్న భక్తులకు రక్షణ అలంకారంగా ప్రసాదిస్తాడాయన.
[5] తన భక్తులు ఈ ఘనమైన స్థితిలో సంతోషంతో ఉప్పొంగిపోతారు గాక! పడుకొన్నప్పుడు కూడా స్వరమెత్తి ఆనందంతో పాడుతారు గాక!
[6] దేవుణ్ణి కీర్తించే మాటలు వారి నోట వెలువడుతాయి గాక! వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉంటుంది గాక!
[7] ఇతర ప్రజలమీద ప్రతీకారం చేయడానికీ, ఆ జనాలను దండించడానికీ,
[8] వాళ్ళ రాజులను గొలుసులతో, వాళ్ళ ఘనులను ఇనుప సంకెళ్ళతో బంధించడానికీ,
[9] గ్రంథంలో రాసి ఉన్న తీర్పు వాళ్ళందరి మీదా నెరవేర్చడానికీ తన భక్తుల చేతిలో ఆ ఖడ్గం ఉంటుంది గాక! ఆయన భక్తులందరికీ ఈ గౌరవం ఉంటుంది. యెహోవాను స్తుతించండి!