[1] యెహోవా, నేను దీనావస్థలో, అక్కరలో ఉన్నాను. గనుక నా మనవి చెవిని బెట్టి జవాబివ్వు.
[2] నేను నీ భక్తుణ్ణి. నా ప్రాణం దక్కించు. నా దేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ సేవకుడైన నన్ను రక్షించు.
[3] ప్రభూ, రోజంతా నీకు మొర పెట్టుకొంటున్నాను. నన్ను దయ చూడు.
[4] నా మనసు నీ దిక్కుకు పైకి ఎగిసిపోయేలా చేస్తున్నాను. నీ సేవకుడైన నాకు మానసికానందం కలిగించు.
[5] ప్రభూ, దయామయుడివి. నీవు క్షమించడానికి ఎప్పుడూ సిద్దమే, నీకు మొరపెట్టేవారందరి మీదా నీ కృప అధికం.
[6] యెహోవా, నా ప్రార్థన చెవిని బెట్టు. నా విన్నపాలు ఆలకించు.
[7] నీవు నాకు జవాబిస్తావు. కాబట్టి, నా కష్టాలలో నేను నీకు మొరపెట్టుకుంటున్నాను.
[8] ప్రభూ, నీవు గొప్పవాడివి, అద్భుతాలు చేసేవాడివి. నీవు ఒక్కడివే దేవుడవు.
[9] ప్రభూ, దేవుళ్ళనబడ్డ వాళ్ళలో నీలాంటివాడు లేడు. నీవు చేసే పనులు సాటిలేనివి.
[10] ఇతర జనాలంతా కూడా నీ సృష్టే. అవన్నీ వచ్చి నీ సన్నిధానంలో నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తాయి. నీ పేరుకు ఘనత కలిగిస్తాయి.
[11] యెహోవా, నీ మార్గం నాకు ఉపదేశించు. నేను నీ సత్యానికి అనుగుణంగా ప్రవర్తిస్తాను. నీ పేరట నాకు భయభక్తులు అలవడే లా నా హృదయానికి ఒకే ఒక ఉద్దేశం కలిగించు.
[12] ప్రభూ, నా దేవా, నేను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత అర్పిస్తాను. నీ పేరుకు నిత్యమూ ఘనత కలిగిస్తాను.
[13] నా పట్ల నీవు చూపిన అనుగ్రహం గొప్పది. మృత్యులోకంలోని లోతైన స్థలంనుంచి నా ప్రాణం తప్పించావు.
[14] దేవా, గర్విష్ఠులు నామీదికి ఎగబడ్డారు. దౌర్జన్యపరులు గుమికూడి నా ప్రాణం తీయాలని ఉన్నారు. వాళ్ళకు నీవంటే లెక్కేలేదు.
[15] ప్రభూ! నీవు వాత్సల్యమయుడవైన దేవుడివి. దయామయుడివి. సహనశీలుడివి. కృపాసత్య సంపూర్ణుడివి.
[16] నా వైపు తిరుగు. నన్ను దయ చూడు. నీ సేవకుడైన నాకు నీ బలం ప్రసాదించు. నీ దాసురాలి కొడుకైన నన్ను రక్షించు.
[17] యెహోవా, నీవు నాకు సహాయం చేసి నన్ను ఆదరించడం చూచి నా పగవాళ్ళు సిగ్గుపడాలి. గనుక శుభప్రదమైన సూచన ఒకటి నాకు చూపు.