Skip to content
Opens in a new window

[1] యెహోవా పరిపాలిస్తున్నాడు. భూమి ఆనందిస్తుంది గాక! ద్వీపాలన్నీ సంతోషిస్తాయి గాక!

[2] మేఘాలు, దట్టమైన చీకటి ఆయనను ఆవరించి ఉన్నాయి. నిజాయితీ, న్యాయమూ ఆయన సింహాసనానికి పునాదిగా ఉన్నాయి.

[3] ఆయన ఎదుటనుంచి మంటలు బయలు దేరుతాయి, చుట్టూరా ఉన్న ఆయన శత్రువులను కాల్చివేస్తాయి.

[4] ఆయన మెరుపులు లోకాన్ని ప్రకాశవంతం చేస్తాయి. భూమి దానిని చూచి వణికిపోతుంది.

[5] యెహోవా సన్నిధానంలో, సర్వ ప్రపంచానికీ ఉన్న ఆ ప్రభువు ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.

[6] ఆకాశాలు ఆయన నీతిన్యాయాలను ప్రకటిస్తున్నాయి. సర్వలోక ప్రజలు ఆయన తేజస్సును చూస్తారు.

[7] చెక్కిన విగ్రహాలు పూజిస్తూ, ఆ వ్యర్థమైన వాటినిబట్టి అతిశయించే వాళ్ళకు సిగ్గు, ఆశాభంగం కలుగుతాయి. దేవుళ్ళనబడ్డవాళ్ళంతా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చెయ్యాలి!

[8] యెహోవా! సీయోను ఇది విని, న్యాయ సమ్మతమైన నీ తీర్పుల కారణంగా సంతోషిస్తూ ఉంది. యూదా కుమార్తెలు ఆనందిస్తూ ఉన్నారు.

[9] యెహోవా! ప్రపంచమంతటికీ పైగా ఉన్న సర్వాతీతుడివి నీవే. నీవు దేవుళ్ళందరికీ ఎంతో ఉన్నతంగా ఉన్నావు.

[10] యెహోవాను ప్రేమించేవారలారా! చెడుతనాన్ని అసహ్యించుకోండి. తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడుతాడు. దుర్మార్గుల బారినుంచి ఆయన వారిని తప్పిస్తాడు.

[11] న్యాయవంతులకు వెలుగును వెదజల్లుతాడు. హృదయంలో నిజాయితీ ఉన్నవారికి ఆనందాన్ని వెదజల్లుతాడు.

[12] న్యాయవంతులారా, యెహోవామూలంగా ఆనందించండి. ఆయన పవిత్రమైన పేరును బట్టి కృతజ్ఞత అర్పించండి.

కీర్తనలు — Chapters