[1] దేవా! సీయోనులో నీ ఎదుట మౌనంగా ఉండడం, నిన్ను స్తుతించడం యోగ్యం. నీకు మ్రొక్కుకొన్న ప్రకారం చేసితీరాలి.
[2] నీవు ప్రార్థన వినేవాడవు. మానవత యావత్తు నీ దగ్గరికి వస్తుంది.
[3] అపరాధాలు నన్ను జయించాయి. అయితే నీవు మా అతిక్రమాలను కప్పివేశావు.
[4] నీ ఆలయం పరిసరాలలో ఉండడానికి నీవు ఎన్నుకొని నీదగ్గర చేర్చినవారు ధన్యజీవులు! నీ పవిత్రాలయం అనే నీ ఇంట్లో ఉన్న ఆశీస్సులు మాకు సంతృప్తి కలిగిస్తాయి.
[5] మా రక్షణకర్తవైన దేవా! భయభక్తులను కలిగించే కార్యకలాపాల ద్వారా న్యాయసమ్మతంగా నీవు మాకు జవాబిస్తావు. భూమి కొనలన్నిట్లో ఉన్నవారికీ, సుదూర సముద్ర తీర వాసులకూ నీవే ఆశ్రయం.
[6] ప్రభావ సంపన్నతే ఆయనకు నడికట్టు. తన బలంతో పర్వతాలను సుస్థిరం చేశాడు.
[7] ఆయన సముద్రం హోరునూ అలల ఘోషనూ ప్రశాంతం చేస్తాడు. జనాల కలకలం అణచివేస్తాడు.
[8] భూగోళం పొలిమేరలలో నివసించే ప్రజలు నీ సూచకమైన క్రియలు చూచి భయపడుతారు. ఉదయ సాయంత్రాల ఆరంభం ఉత్సాహ జనకమైన పాటతో నింపివేస్తున్నావు.
[9] నీవు ఈ భూమిని సందర్శిస్తావు. అది పొంగి పొర్లిపోతుంది. దానిని చాలా ఫలవంతం చేస్తావు. దేవుని నది జలమయం. మనుషులకు ధాన్యం అనుగ్రహిస్తావు. నీవు భూమిని సంసిద్ధం చేస్తావు.
[10] దాని దుక్కులకు సమృద్ధిగా నీరు ప్రసాదిస్తావు. నాగటి చాళ్ళమధ్య భూమిని సమతలం చేస్తావు. వాన జల్లులతో అది మెత్తబడేలా చేస్తావు. మొలకెత్తినప్పుడు దానిని నీవు దీవిస్తావు.
[11] సంవత్సరమంతటికీ నీవు చేసిన మేలు మకుటాయమానంగా ఉంది. నీ రథ చక్రాల జాడలు జీవసారం ఒలకబోస్తున్నాయి.
[12] అడవి బీళ్ళు నాని సారాన్ని చిందుతున్నాయి. కొండలు ఆనందాన్ని నడుముకు చుట్టుకొన్నాయి.
[13] పచ్చిక మైదానాలను గొర్రెల మందలు వస్త్రంలాగా అలంకరించాయి. లోయలో అంతటా సస్యాలే. అవన్నీ ఆనంద ధ్వనులు చేస్తున్నాయి. అన్నీ సంగీతం పాడుతున్నాయి.