[1] నేను స్వరమెత్తి దేవునికి మొరలిడుతాను. నేను స్వరమెత్తుతాను. ఆయన నా మొర ఆలకిస్తాడు.
[2] నా కష్టదశలో నేను ప్రభువును వెదికాను. రాత్రి పూట నా చెయ్యి ఎడతెగకుండా చాచి ఉంది. నా ఆత్మ ఓదార్పును నిరాకరించింది.
[3] నేను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని నిట్టూరుస్తున్నాను. ధ్యానం మధ్యలో నా ఆత్మ నీరసించిపోయింది. (సెలా)
[4] నీవు నా కనురెప్పలు వాలిపోనివ్వలేదు. నేను మాట్లాడలేనంతగా కలవరపడుతున్నాను.
[5] మునుపటి రోజులను, గతించిన సంవత్సరాలను గురించి నేను ఆలోచన చేశాను.
[6] రాత్రి పూట నేను పాడిన పాటను జ్ఞాపకం చేసుకొంటున్నాను. నా హృదయంతో నేను మాట్లాడుకొంటున్నాను. నా ఆత్మ శ్రద్ధగా అన్వేషిస్తూ ఉంది.
[7] ప్రభువు నన్ను ఎప్పటికీ త్రోసివేస్తాడా? ఆయన ఇంకెప్పుడూ నన్ను సంతోషంతో స్వీకరించడా?
[8] ఆయన అనుగ్రహం ఎప్పటికీ గతించిపోయిందా? తరతరాలకు ఆయన చేసిన వాగ్దానం విఫలమయిందా?
[9] దేవుడు దయ చూపడం మరిచిపొయ్యాడా? ఆయన కోపపడి తన వాత్సల్యం కనబడకుండా చేశాడా?
[10] అప్పుడు నేను ఈవిధంగా తలపోశాను: ఇది నా బాధ. కానీ, సర్వాతీతుడి కుడి చేతిలోని సంవత్సరాలు స్ఫురణకు వస్తున్నాయి.
[11] యెహోవా చర్యలను తలచుకుంటాను. దేవా, పూర్వం నీవు చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాను.
[12] నీ కార్యకలాపం అంతా నేను ధ్యానం చేసుకుంటాను. నీ పనులను తలపోసుకుంటాను.
[13] దేవా, నీ మార్గం పవిత్రం. మా దేవునిలాంటి మరో గొప్ప దేవుడు ఏడీ, ఎక్కడున్నాడు?
[14] దేవా, నీవే అద్భుత క్రియలు చేసేవాడివి. జనాలమధ్య నీ బలప్రభావాలను నీవు ప్రత్యక్షం చేశావు.
[15] చేయి ఎత్తి నీ ప్రజలను విడిపించావు. యాకోబు యోసేపుల సంతతికి విడుదల ప్రసాదించావు. (సెలా)
[16] దేవా, జలాలు నిన్ను చూశాయి. నిన్ను చూచి, భయపడిపొయ్యాయి. జలాగాధాలు వణికిపొయ్యాయి.
[17] మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి. ఆకాశం గర్జించింది. నీ బాణాలు బయలుదేరాయి.
[18] నీ ఉరుముల మోత సుడిగాలిలో వినిపించింది. నీ మెరుపులు లోకాన్ని వెలిగించాయి. భూమి వణికింది, కంపించింది.
[19] నీవు సముద్రంలో నడిచావు నీ త్రోవలు మహా జలాలలో ఉన్నాయి. నీవి గుర్తించరాని అడుగు జాడలు.
[20] మోషే అహరోనులచేత మందలాంటి నీ ప్రజలకు వెళ్ళవలసిన దారి చూపించావు.