[1] బలాఢ్యుడా! చెడుగు చేసి గొప్పలు చెప్పుకుంటావెందుకు? దేవుని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
[2] వంచకుడా! నీ నాలుక పదునైన మంగలికత్తిలాంటిది. అది నాశనకరమైన విషయాలు కల్పిస్తుంది.
[3] నీకు మంచికంటే చెడుగు ఎక్కువ ఇష్టం. నిజం చెప్పడంకంటే అబద్ధం చెప్పడం నీకిష్టం. (సెలా)
[4] మోసకరమైన నాలుకా! నాశనకరమైన మాటలన్నీ నీకిష్టం గదా!
[5] అందుచేత దేవుడు నిన్ను శాశ్వత నాశనానికి గురి చేస్తాడు. పట్టుకుని నీ డేరాలో నుంచి పీకివేస్తాడు నిన్ను. సజీవుల లోకంలో లేకుండా నిన్ను రూపుమాపుతాడు. (సెలా)
[6] ఇదంతా చూచి న్యాయవంతులు భయభక్తులతో ఉంటారు. అతణ్ణి చూచి నవ్వుతారు.
[7] “చూడండర్రా ఈ పెద్ద మనిషి దేవుణ్ణి తన ఆశ్రయం చేసుకోలేదు. తన ధన సమృద్ధిమీద ఆధారపడ్డాడు. నాశనకారకుడైన తన మార్గంలో బలవంతుడయ్యాడు” అని చెప్పుకొంటారు.
[8] కాని, నేను దేవుని ఆలయంలో పచ్చని ఆలీవ్‌చెట్టులాగా ఉన్నాను. దేవుని కరుణను నేను ఎప్పటికీ నమ్ముకుంటున్నాను.
[9] నీవు జరిగించినదానిని బట్టి నీకు కృతజ్ఞతలు ఎల్లప్పుడు అర్పిస్తాను. నీ పేరు శ్రేష్ఠమైనది. నీ పేర నీ భక్తుల ఎదుట ఆశాభావంతో ఎదురు చూస్తాను.