[1] యెహోవా నా ప్రభువుతో పలికిన వాక్కు: “నీ శత్రువులను నీ పాదాల క్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.”
[2] యెహోవా సీయోను నుంచి నీ రాజదండాన్ని పొడిగిస్తాడు. “నీ శత్రువుల మధ్య ప్రభుత్వం చెయ్యి” అంటాడు.
[3] నీవు నీ బలపరాక్రమాలను కనుపరచే రోజుల్లో నీ ప్రజలు మనసారా ముందుకు వస్తారు. నీ యువకులు పవిత్ర వస్త్రాలు ధరించి, నీకు ఉదయ గర్భంలో నుంచి కలిగే మంచు బిందువుల్లాగా ఉంటారు.
[4] యెహోవా ప్రమాణం చేశాడు. దీని గురించి ఆయనేమీ పశ్చాత్తాపపడడు. “నీవు మెల్కీసెదెకు వరుస ప్రకారం సదాకాలం యాజివి” అన్నాడు.
[5] ప్రభువు నీ కుడి ప్రక్కన ఉన్నాడు. తన ఆగ్రహ దినంలో ఆయన రాజులను చితగ్గొట్టివేస్తాడు.
[6] లోక ప్రజలకు ఆయన తీర్పు తీరుస్తాడు. శవాలు అంతటా ఉండేలా చేస్తాడు. విశాల లోకం అధిపతిని చితగ్గొట్టివేస్తాడు.
[7] దారిలో వాగు నీళ్ళు తాగుతాడాయన. అందుచేత ఆయన తల పైకెత్తుకొంటాడు.