Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీ అనుగ్రహాన్ని బట్టీ సత్యాన్ని బట్టీ నీ పేరుకే ఘనత చేకూరాలి. మాకు కాదు. మాకు కానేకాదు.

[2] “ఏడీ, వాళ్ళ దేవుడు ఎక్కడున్నాడు?” అంటూ ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకుంటున్నట్టు?

[3] మన దేవుడు పరలోకంలో ఉన్నాడు. తనకు ఏది ఇష్టమో అది చేసేవాడు.

[4] వాళ్ళ దేవుళ్ళు వెండి బంగారు విగ్రహాలు, మనుషులు చేతులతో చేసినవి.

[5] వాటికి నోరుంది కాని, మాట్లాడలేవు. కండ్లున్నాయి కాని, చూడలేవు.

[6] చెవులున్నాయి కాని, వినలేవు. ముక్కులున్నాయి కాని, వాసన చూడలేవు.

[7] చేతులున్నాయి కాని, తాకి చూడలేవు. పాదాలున్నాయి కాని, నడవలేవు. గొంతు ఉన్నా, పలకలేవు.

[8] విగ్రహాలు తయారు చేసే వాళ్ళు, వాటిమీద నమ్మకం ఉంచేవాళ్ళంతా వాటిలాగే అవుతారు.

[9] ఇస్రాయేల్‌ప్రజలారా! యెహోవా మీద నమ్మకం ఉంచండి. ఆయనే అలాంటివారికి సహాయం, డాలులాంటివాడు.

[10] అహరోను వంశమా! యెహోవా మీద నమ్మకం ఉంచండి. ఆయనే అలాంటి వారికి సహాయం, డాలులాంటివాడు.

[11] యెహోవా అంటే భయభక్తులున్న వారలారా! యెహోవా మీద నమ్మకం ఉంచండి. ఆయనే అలాంటివారికి సహాయం, డాలులాంటివాడు.

[12] యెహోవాకు మనం జ్ఞాపకమే. ఆయన మనలను దీవిస్తాడు. ఆయన ఇస్రాయేల్‌వంశాన్ని దీవిస్తాడు. ఆయన అహరోను వంశాన్ని దీవిస్తాడు.

[13] యెహోవా అంటే భయభక్తులున్న వారిని చిన్నవారినీ పెద్దవారినీ ఆయన దీవిస్తాడు.

[14] యెహోవా మీకూ, మీ పిల్లలకూ వృద్ధి కలిగిస్తాడు గాక!

[15] ఆకాశాన్నీ, భూమినీ సృజించిన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక!

[16] ఆకాశాలన్నీ యెహోవాకు చెందినవి. భూమిని ఆయన మనుషులకిచ్చాడు.

[17] యెహోవాను స్తుతించవలసినది చనిపోయినవారు కాదు, మౌన లోకంలోకి దిగిపోయేవారిలో ఎవరో కాదు.

[18] మనమే యెహోవా సంకీర్తనం చేయాలి. ఇప్పటినుంచి ఎప్పటికీ మనం యెహోవా స్తుతి చేస్తూ ఉంటాం. యెహోవాను స్తుతించండి!

కీర్తనలు — Chapters