[1] యెహోవా, నేను నిన్ను నమ్మి ఆశ్రయించాను. నన్ను ఎన్నడూ సిగ్గుపాలు కానియ్యకు. నీ న్యాయబుద్ధి ననుసరించి నన్ను తప్పించు.
[2] నా మొర చెవిని పెట్టి త్వరగా నాకు విడుదల ప్రసాదించు. నాకు ఆశ్రయమిచ్చే బండగానూ, నన్ను కాపాడే బలమైన కోటగానూ ఉండు.
[3] నీవే నా ఆధారశిల, నా దుర్గం. నీ పేరుప్రతిష్ఠలకోసం నాకు దారి చూపు, నాకు మార్గదర్శిగా ఉండు.
[4] నా పగవాళ్ళు రహస్యంగా నాకోసం వల ఒడ్డారు. దానినుంచి నీవు నన్ను తప్పించు. నీవే నాకు రక్షక బలం.
[5] నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను. యెహోవా! సత్యస్వరూపి అయిన దేవా! నీవు నన్ను విమోచించావు.
[6] వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళంటే నాకు అసహ్యమే. నేను యెహోవానే నమ్ముకొన్నాను.
[7] నా దీనావస్థను నీవు చూశావు. నా హృదయ బాధలు నీకు తెలిసే ఉన్నాయి. గనుక నేను నీ అనుగ్రహం చూచి ఆనంద భరితుణ్ణయి సంతోషంతో గంతులు వేస్తాను.
[8] నన్ను శత్రువుల వశం చెయ్యకుండా విశాల ప్రదేశంలో నా అడుగులు పెట్టించావు.
[9] యెహోవా! నన్ను దయ చూడు. దురవస్థలో ఉన్నాను. శోకంవల్ల నా కళ్ళు పీక్కుపొయ్యాయి. నా మనసూ, నా తనువూ చీకిపొయ్యాయి.
[10] దుఃఖంతో కుమిలిపోతూ బ్రతుకుతున్నాను. నిట్టూర్పులతో నా బ్రతుకు తరిగిపోతూ ఉంది. నా అపరాధాలు నా బలాన్ని హరించివేశాయి. నా ఎముకల్లో సత్తువ లేకుండా పోయింది.
[11] నా శత్రువులందరికీ నేనంటేనే అవమానం! ఇరుగు పొరుగు వాళ్ళకు మరీనూ! నాతో పరిచయం ఉన్నవాళ్ళకు నేనంటే భయం. వీధిలో నన్ను చూచేవాళ్ళు తప్పుకొని పారిపోతారు.
[12] చనిపోయి జ్ఞప్తిలో లేనివాడిలాగా ప్రజలు నన్ను మరచిపోయారు. నేను పగిలిపోయిన పాత్రలాంటివాణ్ణి.
[13] చాలామంది చెప్పిన కొండెం నాకు వినవచ్చింది. వాళ్ళు నా మీద దురాలోచనలు చేస్తున్నారు. నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు. నలుదిక్కులా భయ కారణాలున్నాయి.
[14] యెహోవా! నిన్ను నమ్ముకొంటున్నాను. “నీవే నా దేవుడవు” అంటున్నాను.
[15] నా జీవిత కాలాలు ఉన్నది నీ చేతిలోనే. నా శత్రువుల చేతిలో పడకుండా నన్ను తప్పించు. నా వెంటపడేవాళ్ళ బారి నుంచి నన్ను కాపాడు.
[16] నీ దాసుడైన నా మీద నీ ముఖకాంతి రేఖలు ప్రసరించనియ్యి. అనుగ్రహం చూపి నన్ను రక్షించు.
[17] యెహోవా నీకు మొరపెట్టాను. నాకు ఆశాభంగం కలగనియ్యకు దుర్మార్గులకే ఆశాభంగం కలగాలి! వాళ్ళు మృత్యులోకంలో పడి మౌనంగా ఉండాలి!
[18] అబద్ధాలాడే వాళ్ళ నోళ్ళు మూసుకుపోవాలి. వాళ్ళు తృణీకారం, గర్వం వెల్లివిరుస్తూ దురహంకారంతో న్యాయవంతులకు వ్యతిరేకంగా మాట్లాడుతారు.
[19] నీవంటే భయభక్తులున్న వాళ్ళకోసం నీవు భద్రం చేసిన మేలు ఎంతో గొప్పది! నిన్ను నమ్మి ఆశ్రయించిన వారికి మనుషుల ఎదుట నీవు చేసే మేలు ఎంతో గొప్పది!
[20] మనుషుల కుట్రనుంచి వారిని నీ రహస్య సన్నిధానంలో మరుగు చేస్తావు. తమతో జగడమాడే నోళ్ళ ఎదుటనుంచి వారిని నీ ఆశ్రయంలో క్షేమంగా ఉంచుతావు.
[21] ముట్టడికి గురి అయిన పట్టణంలో యెహోవా తన అనుగ్రహం ఆశ్చర్యకరమైన విధంగా నాకు చూపాడు. ఆయనకు స్తుతి కలుగుతుంది గాక!
[22] కంగారుపడిపోయి నీ కనుదృష్టిలో లేకుండా పోయాను. “నీవు నన్ను లక్ష్య పెట్టడం మానుకొన్నావు” అనుకొన్నాను. అయితే సహాయంకోసం నేను ప్రాధేయపడ్డప్పుడు నీవు నా స్వరం, నా విన్నపం ఆలకించావు.
[23] యెహోవా భక్తులారా! మీరంతా ఆయనను ప్రేమిస్తూ ఉండండి. నమ్మకమైనవారిని యెహోవా కాపాడుతాడు. కాని, గర్విష్ఠులకు విస్తారమైన ప్రతిఫలమిస్తాడు.
[24] యెహోవా కోసం ఎదురు చూచేవారలారా! స్థిరంగా ఉండండి. హృదయంలో నిబ్బరంగా ఉండండి.