Skip to content
Opens in a new window

[1] యెహోవా నా వెలుగు, నా రక్షణ. ఎవరికైనా నేనెందుకు భయపడాలి? యెహోవా నా ప్రాణానికి కోటలాంటివాడు. ఎవరైతేనేం నాకేం భయం?

[2] దుర్మార్గులు నన్ను మింగివేయడానికి ఎదుర్కొన్నప్పుడు నా శత్రువులూ, నా పగవాళ్ళూ అలా నా పైబడ్డప్పుడు, తప్పటడుగు వేసి కూలిపోయింది వాళ్ళే!

[3] ఒక సైన్యం నాకు విరోధంగా దండెత్తి వచ్చినా కూడా నా గుండెలు అదరవు. యుద్ధం నా మీదికి ఎగబడి వచ్చినా ఈ విషయంలో నా ధైర్యం చెడదు.

[4] యెహోవాను ఒకటి కోరాను. దానిని నేను వెదుకుతాను. యెహోవా మనోజ్ఞతను చూస్తూ ఉండడానికి, ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉండడానికి నేను బ్రతికే రోజులన్నీ ఆయన ఇంటిలో జీవితం గడపాలని ఉంది.

[5] ఎందుకంటే, విపత్తు వచ్చిన రోజున తన ఆశ్రమంలో నన్ను దాచివేస్తాడు. తన గుడారంలోని రహస్య స్థలంలో నన్ను ఉంచుతాడు. నన్ను ఎత్తైన బండమీదికి ఎక్కిస్తాడు.

[6] నా చుట్టూరా శత్రువులే! కాని, ఇప్పుడు వాళ్ళకు పైగా నేను తలెత్తుకొనేలా చేస్తాడు. ఆయన ఆరాధన గుడారంలో ఆనంద ధ్వనులతో బలులర్పిస్తాను. యెహోవాకు పాటలు పాడుతాను, సంకీర్తన చేస్తాను.

[7] యెహోవా! నేను ఎలుగెత్తి ప్రార్థన చేసేటప్పుడు ఆలకించు. దయ చూపి జవాబియ్యి.

[8] “నా సముఖాన్ని వెదుకు” అని నీవు అన్నప్పుడు “యెహోవా, నీ సముఖాన్ని వెదుకుతాను” అంటూ నీతో మాట కలిపినది నా హృదయం.

[9] నీ ముఖం నాకు కనబడకుండా చేయకు. నీ దాసుడైన నన్ను కోపంతో త్రోసిపుచ్చకు. నాకు సహాయం చేసేది నీవే! నన్ను రక్షించే దేవా, నన్ను వదిలిపెట్టకు, నన్ను జారవిడువకు.

[10] నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా యెహోవా నన్ను చేరదీస్తాడు.

[11] యెహోవా, నీ మార్గాన్ని నాకు ఉపదేశించు. నా విరోధుల కారణంగా సరైన దారి చూపు.

[12] అబద్ధాలాడే సాక్షులు నాకు వ్యతిరేకంగా లేచారు. దౌర్జన్యంతో బుసలు కొడుతున్నారు వాళ్ళు. నా శత్రువుల ఇష్టానికి నన్ను అప్పగించవద్దు.

[13] సజీవులు కాపురమున్న చోట నేను యెహోవా మంచితనాన్ని చూడగలననే నమ్మకం నాకు లేకపోతే నా గతేం కాను?

[14] యెహోవా వైపు ఆశాభావంతో ఎదురుచూడు. స్థిరంగా ఉండు. హృదయంలో నిబ్బరంగా ఉండు. యెహోవా వైపు ఆశాభావంతో ఎదురు చూడు.

కీర్తనలు — Chapters