Skip to content
Opens in a new window

[1] దేవా, మమ్మల్ని ఎందుకిలా ఎప్పటికీ విడిచి పెట్టావు? నీవు మేపే గొర్రెల మందమీద నీ కోపాగ్ని రవులుకొనేది ఎందుకు?

[2] పూర్వం నీవు సంపాదించుకొన్న నీ సమాజాన్ని తలచుకో. అది నీ సొత్తు అయిన గోత్రంగా ఉండడానికి దానిని విడిపించావు. నీవు నివసించే ఈ సీయోను కొండను తలచుకో.

[3] ఎప్పటికీ ఇలాగే శిథిలమై పడి ఉన్న స్థలాలకు దగ్గరగా రా. పవిత్రాలయంలో ప్రతి వస్తువునూ శత్రువులు పాడు చేశారు.

[4] నీ సమాజ స్థలం మధ్యలో నీ విరోధులు గర్జించారు. తమ జెండాలను విజయసూచకంగా పైకెత్తారు.

[5] అడవిలో గుబురు చెట్ల మీద ఎవడో గొడ్డలి ఎత్తినట్టు ఆ దృశ్యం కనిపించింది.

[6] వాళ్ళు గొడ్డళ్ళను, సుత్తెలను చేతపట్టుకొని కొయ్య పై చెక్కబడినదంతా ఎడా పెడా విరగ్గొట్టారు.

[7] నీ పవిత్రాలయానికి నిప్పు పెట్టారు. నీ పేరు ఉన్న స్థలాన్ని నేల కూల్చి, దానిని అపవిత్రం చేశారు.

[8] “వాటిని పూర్తిగా నేలమట్టం చేద్దామ” ని హృదయంలో ఉద్దేశించారు. దేశంలో ఉన్న సమాజ స్థలాలన్నిటినీ తగలబెట్టారు.

[9] ఇప్పుడు మా సంకేతాలేవో మాకు కనబడడం లేదు. ప్రవక్త అనేవాడెవడూ లేడు. ఎంతకాలమని ఇలా ఉంటుందో తెలిసినవాడు కూడా మామధ్య లేడు.

[10] దేవా, విరోధులు ఎంత కాలమని ఈ విధంగా తిరస్కారం చేస్తారు? శత్రువులు నీ పేరును ఎల్లప్పుడూ దూషిస్తూనే ఉంటారా?

[11] నీ చెయ్యి, నీ కుడి చెయ్యి ఎందుకు వెనక్కు తీశావు? నీ రొమ్ము మీదనుంచి చెయ్యి చాపి వాళ్ళను నాశనం చెయ్యి.

[12] పురాతన కాలం నుంచీ దేవుడే నా రాజు. ఆయన భూమధ్యలో రక్షణ క్రియలు చేసేవాడు.

[13] నీ బలంచేత సముద్రాన్ని పాయలుగా విభజించావు. నీటిలో ఉన్న బ్రహ్మాండమైన ప్రాణుల తలలు నీవు పగలగొట్టావు.

[14] లివయాటాన్‌తలను చితగ్గొట్టి ముక్కలు చేశావు. దానిని ఎడారి జంతువులకు ఆహారంగా ఇచ్చావు.

[15] నీటి బుగ్గలను, నదులను తెరిచావు. జీవ నదులను ఇంకిపొయ్యేట్టు చేశావు.

[16] పగలు నీదే. రాత్రి కూడా నీదే. సూర్యమండలాన్నీ, వెలుగునూ నీవే చేశావు.

[17] భూమికి పొలిమేరలన్నీ నీవే నిర్ణయించావు. ఎండకాలం, చలికాలం నీవే ఏర్పరచావు.

[18] యెహోవా, శత్రువులు నిన్ను తిరస్కరించారనీ, నీ పేరును మూర్ఖ ప్రజలు దూషించారనీ తలచుకో!

[19] దుష్ట మృగానికి నీ గువ్వప్రాణాన్ని అప్పగించకు. దీనావస్థలో ఉన్న నీ ప్రజలను శాశ్వతంగా మరచిపోకు.

[20] లోకంలో చీకటి స్థలాలు దౌర్జన్యపరుల నివాసాలతో నిండి ఉన్నాయి గనుక నీ ఒడంబడికను తలచుకో.

[21] నలిగిపోయినవారిని ఆశాభంగంతో వెనక్కు వచ్చేలా చెయ్యకు. దీనదశలో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు నీ పేరును స్తుతించేలా చెయ్యి.

[22] దేవా, లే! నీ పక్షం నీవే వహించుకో. మూర్ఖులు రోజంతా నిన్ను దూషిస్తున్నారని జ్ఞాపకం ఉంచుకో.

[23] నీకు వ్యతిరేకంగా చెలరేగేవాళ్ళ అలజడి ఎడతెగకుండా పైకి లేస్తూ ఉంది. ఈ నీ విరోధుల కేకలు మరువకు.

కీర్తనలు — Chapters