Skip to content
Opens in a new window

[1] యెహోవాకు కృతజ్ఞత అర్పించడం మంచిది. సర్వాతీతుడా, నీ పేరును కీర్తించడం మంచిది.

[2] పది తంతుల వాద్యంతో, సితారా స్వరంతో

[3] ఉదయ కాలంలో నీ విశ్వసనీయతను తెలియజేయడం మంచిది.

[4] యెహోవా, నీవు చేసిన దానిమూలంగా నాకెంతో సంతోషం కలుగుతూ ఉంది. నీవు నీ చేతులారా చేసిన పనులను బట్టి నాకెంతో ఉల్లాసం.

[5] యెహోవా, నీ క్రియలు ఎంతో గొప్పవి. నీ ఆలోచనలు మహా గంబీరమైనవి.

[6] పశుప్రాయులకు ఇవేమీ అర్థం కావు. మూర్ఖులు ఈ విషయాలు తెలుసుకోలేరు.

[7] పచ్చని గడ్డి మొక్కలు మొలకెత్తినట్టు దుర్మార్గులు తలెత్తుతారు. చెడుగు చేసేవాళ్ళు వర్ధిల్లుతారు. అయితే ఇదంతా వాళ్ళ శాశ్వత నాశనానికే.

[8] యెహోవా, శాశ్వతంగా ఉన్నత స్థానం నీదే,

[9] యెహోవా నీ శత్రువులను చూడు. నీ శత్రువులు నాశనమైపోతారు. చెడుగు చేసేవాళ్ళంతా చెల్లా చెదురైపోతారు,

[10] అడవిదున్న కొమ్ముల్లాగా నా కొమ్మును పైకి ఎత్తుతావు. కొత్త తైలంతో నన్ను అభిషేకించావు.

[11] నాకోసం దారి కాచినవాళ్ళను నేను కన్నుల పండుగగా చూశాను. నాకు ఎదురు తిరిగిన దుర్మార్గులకు జరిగినది నా చెవులారా విన్నాను.

[12] న్యాయవంతులు ఖర్జూరచెట్టులాగా చిగుళ్ళు తొడుగుతారు. లెబానోన్‌లోని దేవదారుచెట్టులాగా పెరుగుతారు.

[13] వారు యెహోవా ఆలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాలలో వర్ధిల్లుతారు.

[14] యెహోవా నిజాయితీగలవాడని వెల్లడి చేయడానికి వృద్ధాప్యంలో కూడా వారు ఫలవంతంగా ఉంటారు. వారిలో సారం ఉంటుంది. పచ్చపచ్చగా ఉంటారు.

[15] యెహోవా నా ఆధారశిల. ఆయనలో చెడు అంటూ ఏమీ లేదు.

కీర్తనలు — Chapters