[1] యెహోవాను స్తుతించండి! యెహోవా అంటే భయభక్తులు గలవారు ధన్యజీవులు. ఆయన ఆజ్ఞలంటే చాలా ఇష్టం ఉన్నవారు ధన్యజీవులు.
[2] అలాంటివారి సంతానం భూమిమీద బలాఢ్యులవుతారు. నిజాయితీ గల తరానికి దీవెనలు కలుగుతాయి.
[3] ధనం, ఐశ్వర్యం వారి ఇంట్లో ఉంటాయి. వారి నిర్దోషత్వం శాశ్వతంగా నిలుస్తుంది.
[4] నిజాయితీపరులకు చీకట్లో వెలుగు ఉదయిస్తుంది. వారు దయ, కనికరం గలవారు, న్యాయంగా ప్రవర్తిస్తారు.
[5] దయ కలిగి అప్పిచ్చేవారు ధన్యజీవులు. తీర్పులో వారి వాదమే నెగ్గుతుంది.
[6] అలాంటివారిని ఏదీ ఎన్నడూ కదల్చదు. న్యాయవంతులు శాశ్వతంగా జ్ఞాపకంలో ఉంటారు.
[7] దుర్వార్తలకు వారేమి భయపడరు. వారి హృదయం యెహోవామీద నమ్మకం ఉంచి సుస్థిరమై ఉంటుంది.
[8] వారి హృదయం యెహోవామీద ఆధారపడుతుంది. తమ శత్రువులపట్ల వారి కోరిక నెరవేరేవరకు వారు నిర్భయంగా ఉంటారు.
[9] అక్కరలో ఉన్నవారికి ధారాళంగా ఇస్తారు. వారి నిర్దోషత్వం శాశ్వతంగా నిలుస్తుంది. వారి కొమ్ము గౌరవప్రదంగా పైకి వస్తుంది.
[10] దుర్మార్గులు అది చూచి విసుక్కొంటారు. పండ్లు కొరుక్కొంటారు. వాళ్ళు హరించుకుపోతారు. దుర్మార్గుల కోరిక అంతరించిపోతుంది.