Skip to content
Opens in a new window

[1] నా దేవా! నా దేవా! నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఎందుకు నన్ను కాపాడకుండా, నా ఆక్రందన వినకుండా దూరమయ్యావు?

[2] ఓ నా దేవా! పగలు నేను మొరపెట్టుకొంటున్నాను. రాత్రి వేళ కూడా ఊరుకోవడం లేదు. అయినా నీవేమీ జవాబివ్వడం లేదు.

[3] నీవు పవిత్రుడవు. ఇస్రాయేల్‌ప్రజల స్తుతులతో సింహాసనాసీనుడవు.

[4] మా పూర్వీకులు నిన్నే నమ్ముకొన్నారు. వారు నమ్మినప్పుడు నీవు వారికి విడుదల ప్రసాదించావు.

[5] సహాయంకోసం వారు నీకు మొరపెట్టారు. రక్షణ కలిగింది. నీమీద నమ్మకం ఉంచినప్పుడు వారికి ఆశాభంగం కలగలేదు.

[6] నేనైతే పురుగును, మనిషిని కాను. మనుషులు నన్ను నిందిస్తున్నారు. ప్రజలు నన్ను నీచంగా ఎంచుతున్నారు.

[7] నన్ను చూచేవాళ్ళంతా వేళాకోళం చేస్తారు. తల పంకిస్తూ, పెదవి విరుస్తూ,

[8] “యెహోవా మీద నమ్మకం ఉంచుతున్నాడట. యెహోవా అతణ్ణి తప్పిస్తాడు గాక! ఇతడే గదూ యెహోవా మురిసిపోయే మనిషి! యెహోవా అతణ్ణి రక్షిస్తాడు గాక!” అంటారు.

[9] అయితే నీ మూలంగానే నేను తల్లి గర్భంనుంచి బయటపడ్డాను. తల్లి పాలు కుడిచిన కాలంలోనే నీ మీద నమ్మకం నాకు కలిగించావు.

[10] పుట్టినది మొదలుకొని నీవే నాకు అండ. నా తల్లి నన్ను కన్న రోజునుంచి నీవు నా దేవుడవు.

[11] ఆపద దగ్గరగా ఉంది. నాకు దూరమై ఉండకు. సహాయం చేసేవారు ఇంకెవరూ లేరు.

[12] అనేక ఎద్దులు నన్ను చుట్టుముట్టినట్టు ఉంది. బాషాను ప్రదేశం బలమైన ఎద్దులు నన్ను ముట్టడించినట్టుంది.

[13] గర్జిస్తూ చీల్చివేస్తూ ఉన్న సింహంలాగా వాళ్ళు నోరు తెరుచుకొన్నారు.

[14] నేను పారబోసిన నీళ్ళలాగా అయిపొయ్యాను. నా ఎముకల కీళ్ళన్నీ తప్పాయి. నా హృదయం నాలో మైనంలాగా కరిగిపోయింది.

[15] నా బలం చిల్ల పెంకులాగా ఎండిపోయి ఉంది. నా నాలుక దవడకు అంటుకుపోయింది. నీవు చావుధూళిలో నన్ను పడవేశావు.

[16] కుక్కలలాంటి వాళ్ళు నన్ను నలుప్రక్కలా చుట్టుకొన్నారు. దుర్మార్గుల గుంపు నన్ను ఆవరించింది. నా కాళ్ళు చేతులు పొడిచివేశారు.

[17] నా ఎముకలెన్నో నేను చూచి లెక్క పెట్టగలను. వాళ్ళు నన్ను ఎగాదిగా చూస్తూ ఉన్నారు.

[18] నా వస్త్రాలను తమలో తాము పంచుకొని, నా అంగీకోసం చీట్లు వేస్తున్నారు.

[19] యెహోవా! నాకు దూరంగా ఉండకు. నీవే నాకు బలం. త్వరలో నాకు సహాయం చెయ్యి.

[20] ఖడ్గంనుంచి నా ప్రాణం దక్కించు. కుక్కలాంటివాళ్ళ బారినుంచి నన్ను తప్పించు.

[21] సింహం నోటనుంచి నన్ను కాపాడు. అడవి దున్నల కొమ్ములమీదనుంచి నేను చేసిన ప్రార్థన నీవు ఆలకించావు.

[22] నీ పేరు నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను.

[23] యెహోవా అంటే భయ భక్తులున్నవారలారా! ఆయనను స్తుతించండి! యాకోబు వంశీయులంతా, ఆయనను గౌరవించండి! ఇస్రాయేల్‌సంతతివారంతా, ఆయనను భయభక్తులతో చూడండి.

[24] ఆయన దీనస్థితిలో ఉన్నవాని బాధను నిర్లక్ష్యం చేయలేదు, చీదరించుకోలేదు. అతడి నుంచి తన ముఖం త్రిప్పుకోలేదు. సహాయంకోసం అతడు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించాడు.

[25] మహా సమావేశంలో నా కీర్తన నిన్ను గురించే ఉంటుంది. యెహోవాపట్ల భయభక్తులున్న వారి సమక్షంలో నా మొక్కుబళ్ళు చెల్లించుకొంటాను.

[26] దీనావస్థలో ఉన్న భక్తులు సుష్టుగా భోం చేస్తారు. యెహోవాను వెదికేవారు ఆయనను కీర్తిస్తారు. మీ హృదయాలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి గాక!

[27] భూమి కొనలన్నిటినుంచీ ప్రజలు దీనిని మనసుకు తెచ్చుకొని యెహోవావైపు మరలుతారు. ప్రతి జనంలో ప్రతి జాతిలో మనుషులు నీ ఎదుట సాష్టాంగ నమస్కారాలు చేస్తారు.

[28] ఎందుకంటే పరిపాలన యెహోవాదే. ఆయనే ప్రజలమీద ఏలుతున్నాడు.

[29] లోకంలో అభివృద్ధి పొందినవారంతా భోం చేస్తూ ఆరాధిస్తారు. ప్రాణం దక్కించుకోలేక మట్టిలో కలిసిపోయేవారంతా ఆయన సన్నిధానంలో మోకరిస్తారు.

[30] రాబోయే తరంవారు ఆయనను సేవిస్తారు. ముందు తరానికి ప్రభువును గురించి చెపుతారు.

[31] వారు వచ్చి ఆయన చేసినదానిని తరవాతి తరం ప్రజలకు తెలియజేస్తారు, ఆయన న్యాయ విధానాన్ని చాటుతారు.

కీర్తనలు — Chapters