Skip to content
Opens in a new window

[1] యెహోవా! నా శత్రువులు నన్ను మించి ఉప్పొంగిపోకుండా చేశావు. నీవు నన్ను పైకెత్తావు. కనుక నిన్ను స్తుతిస్తాను.

[2] యెహోవా! నా దేవా! సహాయంకోసం నీకు మొర పెట్టాను. నీవు నాకు ఆరోగ్యం ప్రసాదించావు.

[3] యెహోవా! మృత్యులోకంనుంచి నన్ను లేపావు. నాశనకరమైన గుండంలో పడకుండా నన్ను బ్రతికించావు.

[4] యెహోవా భక్తులారా! ఆయనకు సంకీర్తనం చెయ్యండి. ఆయన పవిత్రమైన పేరును స్తుతించండి.

[5] ఎందుకంటే ఆయన కోపం క్షణంకంటే ఎక్కువ సేపు ఉండదు. ఆయన అనుగ్రహం జీవితాంతంవరకూ ఉంటుంది. ఏడుపు సాయంకాలాన వచ్చి రాత్రంతా ఉండవచ్చు గానీ ప్రొద్దున ఆనంద ధ్వనులు వెల్లి విరుస్తాయి.

[6] అంతా కలిసి వచ్చినప్పుడు నన్ను ఏదీ ఎన్నడూ కదల్చదు అనుకొన్నాను.

[7] యెహోవా, అనుగ్రహం చూపినప్పుడు నన్ను కదలని పర్వతంలాగా నిలిపావు నీవు. నీ ముఖం కనబడకుండా చేసినప్పుడు నేను కలవరపడ్డాను.

[8] యెహోవా! నీకే మొరపెట్టాను. దయ చూపమని నా ప్రభువైన నిన్నే ప్రాధేయపడ్డాను.

[9] నేను చనిపోయి సమాధి పాలయితే అందువల్ల ఏం ప్రయోజనం? మట్టి నిన్ను సంస్తుతి చేయడం జరుగుతుందా? నీ విశ్వసనీయతను తెలియజేయడం సాధ్యమా?

[10] యెహోవా, ఆలకించు! నన్ను కరుణించు! యెహోవా, నాకు సహాయంగా ఉండు.

[11] నా రోదనం నాట్యంగా మార్చావు. నేను కట్టుకొన్న గోనెపట్ట విడిపించి, ఆనంద వస్త్రాన్ని నాకు కట్టబెట్టావు.

[12] నా ఆంతర్యం మౌనం భరించక, నీకు సంకీర్తనం చేయాలని అందులో ఉన్న నీ ఉద్దేశం. యెహోవా! నా దేవా! నేను నీకు సర్వదా కృతజ్ఞత అర్పిస్తాను.

కీర్తనలు — Chapters