Skip to content
Opens in a new window

[1] యెహోవా, నీవెందుకు దూరాన నిలిచి ఉన్నావు? కష్ట సమయాల్లో దాగి ఉంటావెందుకు?

[2] దుర్మార్గులు గర్వంతో దీనదశలో ఉన్న భక్తులను దిగమింగడానికి తహతహలాడుతూ ఉన్నారు. వాళ్ళు పన్నిన కుట్రలలో వాళ్ళే చిక్కుపడిపోతారు గాక!

[3] దుర్మార్గులు తమ ఆశల గురించి గొప్పలు చెప్పుకొంటారు, స్వలాభం కోసం అర్రులు చాపే వాళ్ళను దీవిస్తారు, యెహోవాను తృణీకరిస్తారు.

[4] పొగరుబోతులై ఈ దుర్మార్గులు “దేవుడు ఇదంతా చూడడంలేదు” అనుకుంటారు. దేవుడున్నాడని వాళ్ళెప్పుడూ తలపోయరు.

[5] వాళ్ళు తమ జీవిత విధానాలలో ఎప్పుడూ పట్టు విడవకుండా ఉంటారు. నీ న్యాయ నిర్ణయాలు ఉన్నతంగా ఉండి వాళ్ళ చూపుకు కూడా అందవు. తమ పగవాళ్ళందరినీ వాళ్ళు తృణీకారంతో చూస్తారు.

[6] “మాకు చలనం లేదు. తరతరాలకు మాకు క్షేమం ఉంటుంది” – ఇదీ వాళ్ళ ఆలోచన.

[7] వాళ్ళ నోళ్ళు శాపనార్థాలతో, కపటంతో, వంచనతో నిండి ఉన్నాయి. కీడు, మోసం వాళ్ళ మాటల్లో ఉట్టిపడుతాయి.

[8] గ్రామాలలో చాటున నక్కి కూచుంటారు. మాటు దాగివుండి నిర్దోషులను హత్య చేస్తారు. నిస్సహాయులను ఎలా పట్టుకుందామా అని చూస్తూ ఉంటారు.

[9] గుహలో సింహంలాగా వీళ్ళు పొంచి ఉంటారు. దిక్కులేని వారిని పట్టుకోవడానికి ఎక్కడో నక్కి ఉంటారు. వారిని పట్టుకొని తమ వలలో పడవేసుకుంటారు.

[10] దిక్కులేనివారు నలిగిపోతారు, అణిగి ఉంటారు. ఆ బలాత్కారుల వల్ల నిస్సహాయులు కూలుతారు.

[11] “దేవుడు మరచిపొయ్యాడు లే. తన ముఖం మరో వైపు త్రిప్పాడు. ఇటు వైపు ఎప్పుడూ దృష్టి సారించడు” అనుకుంటారు వాళ్ళు.

[12] యెహోవా, లే! దేవా, నీ చెయ్యి ఎత్తు! దీనావస్థలో ఉన్నవారిని విస్మరించబోకు!

[13] దుర్మార్గులు దేవుణ్ణి తృణీకరిస్తారెందుకు? నీవేమీ విచారణ చేసి శిక్షించవని వాళ్ళు తమ హృదయాల్లో అనుకుంటారెందుకు?

[14] అయితే నీవిదంతా చూస్తూనే ఉన్నావుగా. ఈ కష్టం, ఈ బాధ నీవు కనిపెట్టి చూస్తున్నావు. నీవు వాళ్ళకు ప్రతీకారం చేసి తీరుతావు. దిక్కులేనివారు నీ మీద ఆధారపడవచ్చు. అనాథలకు నీవు సహాయం చేసేవాడవు.

[15] దుర్మార్గుల భుజ బలం చిన్నా భిన్నం చెయ్యి! చెడ్డవాళ్ళ చెడు అంతరించేవరకు దానిని పరిశోధించు!

[16] యెహోవా ఎప్పటికీ రాజు. ఇతర జనాలు ఆయన దేశంలో లేకుండా నాశనమయ్యాయి.

[17] యెహోవా! దీనావస్థలో ఉన్న భక్తుల ప్రార్థన విన్నావు. నీవు వారి హృదయాలను సుస్థిరం చేస్తావు. అనాథలకూ, హింసకు గురి అయిన వారికీ న్యాయం చేకూర్చడానికి నీవు శ్రద్ధగా వింటావు.

[18] లోక సంబంధులు వారిని ఇంకా బెదిరించకుండా ఉండాలని నీ ఉద్దేశం.

కీర్తనలు — Chapters