[1] దేవుడు మనకు ఆశ్రయం, బలం. అగచాట్లలో ఆయన ఎన్నడూ మనకు తోడు.
[2] అందుచేతే భూతలానికి మార్పులు వచ్చినా, సముద్రం లోతుల్లో పర్వతాలు మునిగిపోయినా, దానికి మేమేమీ భయపడము.
[3] సముద్రం ఘోషించనియ్యి. అలలు నురుగు కట్టనియ్యి. సముద్రం పొంగి పర్వతాలను కదిలించనియ్యి.
[4] అది ఒక నది. దాని శాఖలు దేవుని నగరానికి సంతోషం కలిగిస్తాయి.
[5] ఆ నగరంలో దేవుడు ఉన్నాడు. దాన్ని ఏదీ కదల్చదు. తెల్లవారగానే దేవుడు దానికి సహాయం చేస్తాడు.
[6] జాతులు ఘోషించాయి. రాజ్యాలు కదిలిపోయాయి. ఆయన తన స్వరం వినిపించాడు: భూమి కరిగిపోయింది.
[7] సేనల ప్రభువు యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు కోటగా ఉన్నాడు. (సెలా)
[8] యెహోవా చేసేదేమిటో వచ్చి చూడు. ఆయన భూతలంపై శిథిలాలను కలిగించేవాడు.
[9] భూమికి ఆ కొన నుంచి ఈ కొనదాకా యుద్ధాలు జరగకుండా ఆపగలవాడు కూడా ఆయనే. విండ్లను విరుస్తాడు. ఈటెలను తెంచివేస్తాడు. రథాలను కాల్చివేస్తాడు.
[10] దేవుడు అంటాడు “ఊరుకోండి నేనే దేవుణ్ణని తెలుసుకోండి. జనాలలో నాకు ఉన్నత స్థానం ఉంటుంది. భూలోకంలో నాదే ఉన్నత స్థానం”.
[11] సేనల ప్రభువు యెహోవా మనతో ఉన్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు కోటగా ఉన్నాడు. (సెలా)