Skip to content
Opens in a new window

[1] యెహోవా, నేను నిన్నే నమ్మి ఆశ్రయించాను. నేనెప్పుడూ సిగ్గుపడే పరిస్థితి రానియ్యకు.

[2] నీ న్యాయం దృష్ట్యా నన్ను తప్పించు, విడిపించు. నీవు నా మనవి చెవినిబెట్టు, నన్ను రక్షించు.

[3] నేనెల్లప్పుడూ ఆశ్రయించగలిగేలా నీవే నాకు ఆధారశిలగా ఉండు. నీవే నాకు ఆధారశిల. నీవే నా కోట. నన్ను రక్షించడానికి సంకల్పించావు.

[4] నా దేవా, దుర్మార్గుల బారినుంచి నన్ను విడిపించు. చెడుగుకు ఒడికట్టేవాళ్ళ పట్టునుంచి, దౌర్జన్యపరుల బారినుంచి నన్ను తప్పించు.

[5] ప్రభూ! యెహోవా! నీలోనే నా ఆశాభావం. చిన్నప్పటినుంచీ నిన్నే నమ్ముకుంటూ ఉన్నాను.

[6] తల్లి గర్భంలో పడింది మొదలుకొని నీవే నాకు అండగా ఉన్నావు. తల్లి గర్భంలో నుంచి నన్ను పుట్టించినది నీవే. నేను చేసే సంస్తుతి ఎల్లప్పుడూ నీ గురించే.

[7] అనేకమందికి నేను వింతగా కనబడుతున్నాను. కాని, నీవు నాకు బలమైన ఆశ్రయం.

[8] నా నోరు రోజంతా నీ సంస్తుతితో, నీ ఘనతతో నిండి ఉంది.

[9] ముసలితనం పైబడినప్పుడు నన్ను వదలిపెట్టకు. నా బలం ఉడిగిపోయినప్పుడు నన్ను విడువకు.

[10] నా శత్రువులు నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. నా ప్రాణంకోసం దారి కాచేవాళ్ళు సమాలోచన చేశారు.

[11] వాళ్ళు చెప్పుకొన్నారు, “దేవుడు అతణ్ణి విడిచిపెట్టాడు. అతణ్ణి తరిమి పట్టుకోండి! అతణ్ణి తప్పించేవాళ్ళేవరూ లేరులే!”

[12] దేవా, నాకు దూరం కాబోకు. నా దేవా, త్వరగా వచ్చి నాకు సహాయం చేయి.

[13] నా ప్రాణానికి పగవాళ్ళు సిగ్గుపడి నాశనమవుతారు గాక! నాకు హాని తల పెట్టినవాళ్ళు నిందపాలవుతారు గాక! అవమానానికి గురి అవుతారు గాక.

[14] నా ఆశాభావం ఎడతెగనిది. నిన్ను ఇంకా ఎక్కువగా సంస్తుతి చేస్తాను.

[15] నీ న్యాయం, నీ రక్షణ క్రియలు ఎల్లప్పుడూ నా నోట వెల్లడి అవుతాయి. వాటిని లెక్క పెట్టడానికి నాకు చేతకాదు.

[16] యెహోవాప్రభువు చేసిన బలమైన పనులను తెలియజేస్తాను. నీ న్యాయాన్ని గురించి మాత్రమే మాట్లాడుతాను.

[17] దేవా, నా బాల్యం నుంచీ నీవు నాకు ఉపదేశం చేస్తూ వచ్చావు. ఇప్పటివరకూ ఆశ్చర్యకరమైన నీ పనులను నేను తెలియజేస్తూ వచ్చాను.

[18] దేవా, రాబోయే తరానికి నీ బలం ప్రకటిస్తాను. పుట్టబోయే వారందరికీ నీ ప్రభావం తెలుపుతాను. నాకు తల నెరసిపోయి, నేను పండు ముసలిని అయినప్పుడు నన్ను విడిచిపెట్టకు.

[19] దేవా, నీ న్యాయం ఆకాశమంత ఎత్తయినది. దేవా, నీవు గొప్ప పనులు చేస్తావు. నీకు సాటి ఎవరు?

[20] అనేక బాధలు, కడగండ్లు మేము అనుభవించేలా చేశావు. నీవు మమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తావు. భూమిమీద ఉన్న అగాధంలో నుంచి మమ్మల్ని మళ్ళీ లేవనెత్తుతావు.

[21] మునుపటికంటే నీవు నన్ను ఎక్కువగా గొప్ప చేస్తావు. నా వైపు తిరిగి, నాకు ఆదరణ కలిగిస్తావు.

[22] నా దేవా, తంతివాద్యాలతో నీ సత్యాన్ని బట్టి నిన్ను సంస్తుతి చేస్తాను, నిన్ను కీర్తిస్తాను. ఇస్రాయేల్‌ప్రజకు పవిత్ర దేవుడివి నీవు.

[23] నీ సంకీర్తనం చేస్తూ ఉంటే, నా పెదవులు ఆనంద ధ్వనులు చేస్తాయి. నీవు విడిపించిన నా ప్రాణం కూడా ఆనందిస్తుంది.

[24] నాకు కీడు తల పెట్టినవాళ్ళకు ఆశాభంగం కలిగింది, అవమానం కలిగింది, గనుక నా నాలుక రోజంతా నీ న్యాయాన్ని చాటుతుంది.

కీర్తనలు — Chapters