Skip to content
Opens in a new window

[1] దుర్మార్గులను గురించి కంగారుపడకు. చెడుగు చేసేవాళ్ళను గురించి అసూయపడకు.

[2] త్వరగానే గడ్డి ఎండిపోతుంది, పచ్చని మొక్క వాడిపోతుంది. వాళ్ళ సంగతి కూడా అంతే.

[3] యెహోవా మీద నమ్మకం ఉంచి మంచిని చేస్తూ ఉండు. ఈ దేశంలో నివసించి విశ్వసనీయతను అలవరచుకో.

[4] యెహోవాలోనే నీ ఆనందాన్ని కనుక్కో అప్పుడాయన నీ హృదయాభిలాషలను ప్రసాదిస్తాడు.

[5] యెహోవాకు నీ జీవిత యాత్రను అప్పగించు. ఆయనమీద నమ్మకం ఉంచుకో. అప్పుడు చేయవలసినది ఆయన చేస్తాడు.

[6] నీ న్యాయం ఆయన మూలంగా వెలుగులాగా తేటతెల్లం అవుతుంది. నీ యథార్థ ప్రవర్తనను మధ్యాహ్న కాంతిలాగా ప్రకాశింపజేస్తాడాయన.

[7] యెహోవా సమక్షంలో ప్రశాంతంగా ఉండు. ఆయనకోసం ఓర్పుతో ఎదురు చూడు. తమ సొంత జీవిత విధానాన్ని అనుసరించి వర్ధిల్లేవాళ్ళను గురించి, పన్నుగడలు సాధించేవాళ్ళను గురించి కంగారుపడకు.

[8] కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు. కంగారుపడకు, అది చెడుగుకు దారి తీస్తుంది.

[9] చెడుగు చేసేవాళ్ళు నాశనమైపోతారు. యెహోవా కోసం నమ్మకంతో ఎదురు చూచేవారే ఈ దేశానికి వారసులు

[10] ఇంకా కొద్ది కాలానికే దుర్మార్గులు అంతరిస్తారు. వాళ్ళ స్థలమంతా గాలించినా వాళ్ళు కనిపించరు.

[11] కానీ సాధుగుణం గలవారు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. వారు గొప్ప క్షేమం అనుభవిస్తూ, ఆనందభరితులవుతారు.

[12] దుర్మార్గులు సన్మార్గులమీద కుట్ర పన్నుతారు. వారిని చూచి పళ్ళు పటపట కొరుకుతారు.

[13] ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతున్నాడు వాళ్ళ మరణ దినం వస్తుందని ఆయనకు తెలుసు.

[14] దుర్మార్గులు కత్తి దూశారు, విల్లెక్కుపెట్టి ఉన్నారు. దీనదశలో, అక్కరలో యథార్థ ప్రవర్తన గలవారిని హతమార్చాలనీ వాళ్ళు చూస్తున్నారు.

[15] వాళ్ళ కత్తి వాళ్ళ గుండెల్లోనే దూరుతుంది. వాళ్ళ విండ్లు తుత్తునియలవుతాయి.

[16] న్యాయవంతులకు ఉన్నది కొంచెమే అయినా, అది అనేకమంది దుర్మార్గుల సంపదకంటే మంచిది.

[17] ఎందుకంటే దుర్మార్గుల చేతులు విరిగిపోతాయి గాని సన్మార్గులకు యెహోవా ఆధారం.

[18] నిర్దోషుల రోజులన్నీ యెహోవాకు తెలుసు. వారి వారసత్వం ఎప్పటికీ ఉంటుంది.

[19] చెడు కాలంలో వారికి ఆశాభంగం కలగదు. కరవు రోజుల్లో వారు తృప్తిగా ఉంటారు.

[20] దుర్మార్గులైతే నాశనం అవుతారు. యెహోవా శత్రువులు పచ్చిక మైదానాల అందంలాగే మాయమైపోతారు.

[21] దుర్మార్గులు అప్పు చేస్తారు గాని అప్పు తీర్చరు. సన్మార్గులు దయ చూపుతారు, దానం చేస్తారు.

[22] యెహోవా దీవించినవారు దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. ఆయన శపించినవాళ్ళు నాశనమవుతారు.

[23] యెహోవా ఏ మనిషి నడతను రూపొందిస్తాడో ఆ మనిషి మార్గం ఆయనకు ఎంతో ఇష్టం.

[24] ఒకవేళ అతడు పడిపోయినా యెహోవా అతణ్ణి చెయ్యి పట్టుకొని ఉంటాడు, గనుక అతడేమీ కుప్పకూలిపోడు.

[25] పూర్వం నేను చిన్నవాణ్ణి. ఇప్పుడు ముసలివాణ్ణి. న్యాయవంతులు దిక్కూ దరీ లేకుండా మిగిలిపోవడం గానీ, వారి సంతానం తిండికోసం అడుక్కోవడం గానీ నేనెప్పుడూ చూడలేదు.

[26] వారు నిత్యం దయ చూపుతారు, అప్పిస్తారు. వారి సంతానానికి దీవెనలు కలుగుతాయి.

[27] చెడుగునుంచి తిరిగి, మంచిని చేస్తూ ఉండు, అప్పుడు శాశ్వతంగా బ్రతుకుతావు.

[28] యెహోవా న్యాయవంతులను ప్రేమిస్తున్నాడు. తన భక్తులను చెయ్యి విడువడు. వారిని శాశ్వతంగా కాపాడుతాడు. కాని, దుర్మార్గుల సంతానం నాశనమవుతారు.

[29] సన్మార్గులు దేశానికి వారసులు. వారు అందులో ఎల్లకాలం నివసిస్తారు.

[30] సన్మార్గుల నోళ్ళు జ్ఞానంతో మాట్లాడుతాయి. వారి నాలుకలు న్యాయ సమ్మతంగా పలుకుతాయి.

[31] వారి హృదయాల్లో దేవుని ఉపదేశం ఉంది. కాలు జారకుండా నడుస్తారు వారు.

[32] దుర్మార్గులు సన్మార్గుల కోసం దారి కాస్తారు. వారిని హత్య చేయాలని చూస్తారు.

[33] యెహోవా వారిని వాళ్ళ చేతిలో విడిచిపెట్టడు తీర్పులో వారిని దోషులుగా ఎంచడు.

[34] యెహోవాకోసం ఎదురు చూస్తూ ఉండు. ఆయన మార్గం అనుసరించు. నీవు దేశం స్వాధీనం చేసుకొనేలా ఆయన నిన్ను పైకి ఎత్తుతాడు. నీ కళ్ళెదుటే దుర్మార్గులు నాశనమైపోతారు.

[35] దుర్మార్గుణ్ణి, దౌర్జన్యపరుణ్ణి ఒకణ్ణి చూశాను. స్వస్థలంలో పెరిగే పెద్ద చెట్టులాగా అతగాడు మరీ పెచ్చు పెరిగిపోయాడు.

[36] అంతలోనే ఎవడో ఆ దారిన వెళ్ళి చూస్తే అతడు మాత్రం లేడు. వాడికోసం వెదికాను. వాడు కనబడలేదు.

[37] న్యాయవంతులెవరో గుర్తించు. నిజాయితీపరులెవరో కనిపెట్టి చూడు. శాంతి ప్రియులకు భవిష్యత్తు ఉంది.

[38] కాని, అతిక్రమకారులంతా నశిస్తారు. దుర్గార్గుల సంతానానికి భవిష్యత్తు లేదు.

[39] సన్మార్గులకు విముక్తి యెహోవా మూలంగానే, ఆపద సంభవిస్తే, ఆయనే వారికి బలమైన కోటలాంటివాడు.

[40] యెహోవా వారికి సహాయం చేస్తాడు, వారిని రక్షిస్తాడు, దుర్మార్గుల బారినుండి తప్పిస్తాడు, విముక్తి ప్రసాదిస్తాడు. ఎందుకంటే వారు ఆయన్నే ఆశ్రయించారు.

కీర్తనలు — Chapters