Skip to content
Opens in a new window

[1] దేవా, నేను మొరలిడుతున్నాను. నా మనవి చెవిని బెట్టు. పగవాళ్ళంటే నాకు భయం లేకుండా నన్ను కాపాడు.

[2] దుర్మార్గుల కుట్రనుంచి నన్ను దాచిపెట్టు. అక్రమకారులు చేసే అల్లరినుంచి నన్ను తప్పించు.

[3] వాళ్ళ నాలుకలు కత్తులలాంటివి. వాటికి పదును పెట్టుకొన్నారు. వాళ్ళ విషవాక్కులు బాణాలలాంటివి. వాటిని విల్లెక్కు పెడతారు.

[4] వాళ్ళు మాటున ఉండి నిర్దోషుల మీదికి ఆ బాణాలు విసురుతారు. అకస్మాత్తుగా వారిని కొడతారు. వాళ్ళకు భయమంటూ లేదు.

[5] వాళ్ళు దురాలోచనలు చేస్తూ వాటిలో తమను బలపరుచుకొంటారు. రహస్యంగా వలలు వేసి పట్టుకుందామని చెప్పుకొంటారు. “మమ్మల్ని ఎవరు చూస్తారు?” అనుకొంటారు.

[6] చెడుగు చేయడానికి అవకాశాలకోసం వాళ్ళు వెదుకుతూ ఉంటారు. ఉపాయంతో పన్నాగాలు రూపొందించి సిద్ధంగా ఉంటారు. మనిషి అంతరంగం, హృదయం లోతైనవి.

[7] కాని, దేవుడు తన బాణం వాళ్ళమీద వేస్తాడు. ఉన్నట్టుండి వాళ్ళకు గాయాలు తగులుతాయి.

[8] వాళ్ళు కూలిపోతారు. వాళ్ళ పతనానికి కారణం వాళ్ళ నాలుకే. వాళ్ళను చూచినవారంతా తల పంకిస్తారు.

[9] అప్పుడు మనుషులందరికీ భయం వేస్తుంది. దేవుని పనులు ప్రకటిస్తారు. ఆయన క్రియలు వాళ్ళు బాగా తలపోస్తారు.

[10] న్యాయవంతులు యెహోవాను బట్టి ఆనందిస్తారు. ఆయన్నే నమ్మి ఆశ్రయిస్తారు. హృదయంలో నిజాయితీపరులంతా అతిశయిస్తారు.

కీర్తనలు — Chapters