Skip to content
Opens in a new window

[1] సర్వలోక ప్రజలారా! దేవుణ్ణి గురించి ఆనంద ధ్వనులతో పాడండి.

[2] ఆయన పేరుప్రతిష్ఠలను ఉద్దేశించి సంకీర్తనం చేయండి. ఆయనకు ఘనత ఆరోపించి ఆయనను కీర్తించండి.

[3] దేవునితో ఇలా చెప్పండి: “నీ క్రియలు ఎంత భయభక్తులను కలిగించేవి! నీ మహా బల సంపన్నతనుబట్టి నీకు శత్రువులు విధేయతను నటిస్తారు.

[4] సర్వలోక ప్రజలు నిన్ను ఆరాధిస్తారు. నిన్ను కీర్తిస్తారు. నీ పేరును సంకీర్తనం చేస్తారు” (సెలా)

[5] దేవుని క్రియలను వచ్చి చూడండి. మనుషులపట్ల తాను జరిగించే క్రియాకలాపాలలో ఆయన భయభక్తులను కలిగించేవాడు.

[6] ఆయన సముద్రం ఇంకిపోయేలా చేశాడు. అది ఆరిపోయిన నేల అయింది. నదిలో గుండా వాళ్ళు కాలినడకన వెళ్ళారు. అక్కడ మనం ఆయనను బట్టి ఆనందిస్తాం.

[7] ఆయన బల సంపన్నుడై శాశ్వతంగా పరిపాలన చేస్తున్నాడు. జనాలను చూస్తూ ఉన్నాడు. తిరుగుబాటు చేసేవాళ్ళు తమ్మును గొప్ప చేసుకోకూడదు. (సెలా)

[8] లోక ప్రజలారా! మా దేవుణ్ణి స్తుతించండి. ఆయన కీర్తిని గురించి చాటించండి.

[9] మనకు జీవాన్ని అనుగ్రహించాడాయన. మనల్ని ప్రాణాలతో ఉంచుతున్నాడాయన. ఆయన మన కాళ్ళు జారిపోనియ్యడు.

[10] దేవా, నీవు మమ్మల్ని పరీక్షించావు. వెండిలాగా మమ్మల్ని పుటం పెట్టి శుద్ధి చేశావు.

[11] మమ్మల్ని బందీలుగా చేశావు. మా నడుములమీద పెద్ద బరువు పెట్టావు.

[12] మనుషులు మా నెత్తిమీదికెక్కి ఊరేగేలా చేశావు. మేము మంటల్లో, నీళ్ళలో పడిపోయాం. అయినా నీవు మమ్మల్ని బయటకు రప్పించి సర్వ సమృద్ధిలో ప్రవేశపెట్టావు.

[13] నీ ఆలయంలోకి హోమ బలులతో వస్తాను. నేను నీకు మొక్కుకొన్న ప్రకారం చేసి తీరుతాను.

[14] కష్టాలలో చిక్కుకొన్నప్పుడు నా పెదవులతో నేను మొక్కుకొన్నదంతా, నోరార నేను మొక్కుకొన్నదంతా నీకు అర్పిస్తాను.

[15] పొట్టేళ్ళ హోమ ధూమంతో పాటు కొవ్విన గొర్రెలను నీకు అర్పిస్తాను. ఎద్దులను, మేకపోతులను నీకు అర్పిస్తాను. (సెలా)

[16] దేవుడంటే భయభక్తులు గల ప్రజలారా! మీరంతా రండి, వినండి! ఆయన నా ఆత్మకు ఏం చేశాడో తెలియజేస్తాను.

[17] నేను నోరు తెరచి ఆయనకు ప్రార్థన చేస్తాను. నా నాలుక మీద స్తుతిగీతం ఒకటి ఉంది.

[18] నా హృదయంలో నేను పాపంపై మనసు పెడితే ప్రభువు నా ప్రార్థన వినడు.

[19] దేవుడు తప్పకుండా నా ప్రార్థన విన్నాడు. నా విన్నపం ఆయన ఆలకించాడు.

[20] దేవునికి సంస్తుతి! ఆయన నా ప్రార్థనను విసర్జించలేదు. తన అనుగ్రహం నా దగ్గర నుంచి తొలగించివేయలేదు.

కీర్తనలు — Chapters