Skip to content
Opens in a new window

[1] యెహోవాను స్తుతించండి! పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి! ఉన్నత స్థలాలలో ఉన్నవారలారా, ఆయనను స్తుతించండి!

[2] యెహోవా దేవదూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. యెహోవా సైన్యాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి!

[3] సూర్యమండలమా, చంద్రగోళమా, ఆయనను స్తుతించండి! కాంతిమయ సమస్త నక్షత్రాల్లారా, ఆయనను స్తుతించండి!

[4] అంతరిక్ష సీమలారా, ఆయనను స్తుతించండి! ఆకాశంపై ఉన్న జలాల్లారా, ఆయనను స్తుతించండి!

[5] యెహోవా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఉనికిలోకి వచ్చాయి. ఇవి యెహోవా పేరును స్తుతిస్తాయి గాక!

[6] ఆయన వాటిని ఎప్పటికీ ఉండేలా నిర్మించాడు. వాటిని గురించి శాసనం విధించాడు. ప్రతిదీ దానికి లోబడక తప్పదు.

[7] భూమిమీద ఉన్న సృష్టమా, యెహోవాను స్తుతించండి! సముద్రంలోని బ్రహ్మాండమైన ప్రాణులారా, జలాగాధమా, ఆయనను స్తుతించండి!

[8] మెరుపులూ, వడగండ్లూ, చల్లని మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ,

[9] పర్వతాలూ, సమస్తమైన కొండలూ, ఫలభరితమైన చెట్లూ, సమస్త దేవదారు వృక్షాలూ,

[10] మృగాలూ, సమస్తమైన పశువులూ, నేలమీద పాకే ప్రాణులూ, రెక్కలతో పైకి ఎగిరే పక్షులూ యెహోవాను స్తుతించాలి.

[11] భూరాజులారా, అన్ని దేశాల ప్రజలారా, ఈ లోకంలోని నాయకులారా, సమస్త న్యాయాధిపతులారా,

[12] యువకులారా, కన్యలారా, వృద్ధులారా, పిల్లలారా, యెహోవాను స్తుతించండి.

[13] వారు యెహోవా పేరును స్తుతిస్తారు గాక! ఆయన పేరు మాత్రమే ఉన్నతమైన పేరు. ఆయన వైభవం భూమికంటే, ఆకాశంకంటే కూడా ఉన్నతం.

[14] ఆయన తన ప్రజల కొమ్ము ఎత్తించాడు, తన భక్తులందరికీ స్తుతికారణం కలిగించాడు. వారు ఆయన దగ్గర చేరిన ప్రజ, ఇస్రాయేల్‌ప్రజ. యెహోవాను స్తుతించండి!

కీర్తనలు — Chapters