[1] యెహోవాను స్తుతించండి! నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
[2] నేను బ్రతికి ఉన్నంతకాలం యెహోవాను స్తుతిస్తాను. నాకు ఉనికి ఉన్నంతవరకూ నా దేవునికి స్తుతిగీతాలు పాడుతాను.
[3] రాజులమీద, మానవ మాత్రుల మీద నమ్మకం పెట్టకండి. వాళ్ళవల్ల రక్షణ కలగదు.
[4] వారు ప్రాణం విడుస్తారు. వారు మట్టిలో కలిసిపోతారు. ఆ రోజే వాళ్ళ ఆలోచనలు అంతరించిపోతాయి.
[5] యాకోబు యొక్క దేవుడుఎవరికి అండగా ఉన్నాడో, ఎవరి ఆశాభావం తన దేవుడైన యెహోవా మీద లగ్నమై ఉన్నదో వారు ధన్యజీవులు.
[6] ఆయన భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, అందులో ఉన్నదాన్నంతటినీ సృజించాడు. ఆయన ఆడిన మాట ఎన్నడూ తప్పడు.
[7] దౌర్జన్యానికి గురి అయిన వారికి ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఆకలి గొన్నవారికి ఆహారం అనుగ్రహిస్తాడు. బంధకాలలో ఉన్న వాళ్ళకు యెహోవా విడుదల ప్రసాదిస్తాడు.
[8] యెహోవా గుడ్డివాళ్ళ కన్నులు తెరుస్తాడు. అణగారిపోయినవాళ్ళను పైకెత్తుతాడు. యెహోవా న్యాయవంతులను ప్రేమిస్తున్నాడు.
[9] విదేశీయులను యెహోవా కాపాడుతాడు. తండ్రి లేనివారినీ విధవరాండ్రనూ ఆదరిస్తాడు. చెడ్డవాళ్ళ మార్గం వక్రం అయ్యేలా చేస్తాడు.
[10] యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు. సీయోను! నీ దేవుడు తరతరాలకు రాజ్యమేలుతాడు. యెహోవాను స్తుతించండి!