Skip to content
Opens in a new window

[1] అధికారులారా! మీరు నిజంగా న్యాయంతో మాట్లాడుతారా? మనుషులారా! మీరు నిజాయితీతో తీర్పు తీరుస్తారా?

[2] అలా చేయరు. హృదయంలో చెడుగు కల్పిస్తారు. ఈ దేశంలో కూడా మీరు చేజేతులా దౌర్జన్యాన్ని తూచి మరీ చెల్లిస్తున్నారు.

[3] దుర్మార్గులు పుట్టుకతోనే విపరీత బుద్ధులు. పుట్టినవెంటనే అబద్ధాలాడుతూ దారి తప్పిపోతారు.

[4] నాగుపాము విషంలాంటి విషం వాళ్ళకు ఉంది. వీళ్ళు చెవులు మూసుకొన్న చెవిటి పామువంటివాళ్ళు.

[5] మాంత్రికులు నేర్పుగా ప్రయోగించిన మంత్రాలు వినని పాములాగా ఉన్నారు.

[6] దేవా! వాళ్ళ నోటిపళ్ళు ఊడగొట్టు! యెహోవా! ఈ సింహాల కోరలను ఊడబెరుకు!

[7] పారే నీటిలాగా వాళ్ళు కరిగిపోతారు గాక! వాళ్ళు బాణం వేస్తే, అది ముక్కలు చెక్కలైపోతుంది గాక!

[8] నడిచిపోతూ, కరిగిపోయే నత్తలాగా వాళ్ళు ఉండాలి! వాళ్ళు పొద్దును ఎన్నడూ చూడని గర్భస్రావంలాగా కావాలి!

[9] ముండ్ల కంపతో చేసిన మంటల సెగ మీ కుండలకు తగలకముందే వాటిలోది ఉడికినా, ఉడకకపోయినా, దేవుడు దానిని సుడిగాలితో ఎగరగొట్టివేస్తాడు.

[10] ఆ ప్రతిక్రియను చూచి న్యాయవంతులు సంతోషిస్తారు. దుర్మార్గుల రక్తంలో వారు కాళ్ళు కడుక్కుంటారు.

[11] మనుషులు ఇది చూచి ఇలా అంటారు: “న్యాయవంతులకు బహుమానం తప్పక ఉంటుంది. ఖండితంగా ఈ లోకంలో న్యాయం చేకూర్చే దేవుడు ఉన్నాడు.”

కీర్తనలు — Chapters