[1] దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు. వాళ్ళు భ్రష్టులు, నీచ కార్యాలకు ఒడికట్టేవాళ్ళు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు.
[2] దేవుడు పరలోకంనుంచి మనుషులను పరిశీలనగా చూశాడు. జ్ఞాన దృష్టితో ప్రవర్తించేవారెవరైనా ఉన్నారా అని, దేవుణ్ణి వెదికేవారెవరైనా ఉన్నారా అని ఆయన చూశాడు.
[3] వాళ్ళంతా త్రోవ తప్పినవాళ్ళు. అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు. మంచి చేసేవాడు లేడు, ఒక్కడూ లేడు.
[4] చెడుగు చేసేవాళ్ళు గ్రహించరేమిటి! వాళ్ళు దేవునికి ప్రార్థన చేయరు. పైగా నా ప్రజలను ఆహారం మింగినట్టే దిగమింగివేస్తారు.
[5] భయపడవలసిన అవసరం లేనప్పుడు వాళ్ళకు చాలా భయం కలిగింది. నిన్ను చుట్టుముట్టినవారి ఎముకలను దేవుడు చెల్లా చెదురు చేశాడు. దేవుడు వాళ్ళను త్రోసిపుచ్చాడు. నీవు వాళ్ళకు తలవంపులు కలిగించావు.
[6] అహో! సీయోనులోనుంచి ఇస్రాయేల్‌ప్రజకు సంరక్షణ కలుగుతుంది గాక! దేవుడు తన జనానికి క్షేమస్థితిని మళ్ళీ కలిగించేటప్పుడు యాకోబుప్రజ ఆనందిస్తారు, ఇస్రాయేల్‌జనం సంతోషిస్తారు.