Skip to content
Opens in a new window

[1] యెహోవా! నా ముక్తిదాతవైన దేవా! పగటివేళా, రాత్రిపూటా నేను నీ సన్నిధానంలో సహాయంకోసం ఆక్రందన చేస్తున్నాను.

[2] నా ప్రార్థన అంగీకరించు. నా మొర చెవినిబెట్టు.

[3] నేను కష్టాలతో నిండిపోయి ఉన్నాను. నా ప్రాణం మృత్యు లోకానికి దరిదాపుగా చేరింది.

[4] సమాధిలోకి దిగిపోయేవారి లెక్కలో చేరాను. బలం పూర్తిగా హరించుకుపోయిన మనిషిలాగా ఉన్నాను.

[5] చచ్చినవాళ్లమధ్య విడవబడ్డాను. హతమై సమాధిలో పడి ఉన్న వాళ్ళలాగా ఉన్నాను. నీవు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోనివారిలాగా, నీ చేతుల్లో నుండి తెగతెంపులైపోయిన వారిలాగా అయ్యాను.

[6] నీవు లోతైన గుంటలో నన్ను పెట్టావు. చీకటి స్థలాలలో, అగాధాలలో నన్ను ఉంచావు.

[7] నీ తీవ్ర కోపం నా మీద భారంగా ఉంది. నీ అలలను నా మీదుగా రానిస్తున్నావు. (సెలా)

[8] నా మిత్రులను నాకు దూరం చేశావు. వాళ్ళ దృష్టిలో నేను నీచుణ్ణి అయ్యేలా చేశావు. నేను బందీగా ఉన్నాను. బయటికి రావడం అసాధ్యం.

[9] బాధకారణంగా నా కన్ను చివికిపోయింది. యెహోవా, ప్రతి రోజూ నేను నీకు మొరపెట్టి ఉన్నాను. నీ వైపు చేతులెత్తి చాపి ఉన్నాను.

[10] చచ్చినవాళ్ళ కోసం నీవు అద్భుతాలు చేస్తావా? వాళ్ళ ఆత్మలు లేచి నిన్ను కీర్తిస్తాయా? (సెలా)

[11] నీ అనుగ్రహం గురించి సమాధులలో ఉన్నవారు చెప్పుకొంటారా? నాశన స్థలంలో నీ విశ్వసనీయతను తెలుపుతారా?

[12] నీ అద్భుతాలు అంధకారంలో వెల్లడి అవుతాయా? మరుభూమిలో నీ న్యాయం తెలుస్తుందా?

[13] యెహోవా, నేను సహాయంకోసం నిన్నే ప్రాధేయపడ్డాను. తెల్లవారగానే నా ప్రార్థన నీ సన్నిధానం చేరుతుంది.

[14] యెహోవా, ఎందుకు నన్ను వదిలివేస్తున్నావు? నీ ముఖం నాకు కనబడకుండా చేస్తున్నావెందుకని?

[15] చిన్నప్పటినుంచీ నేను బాధితుణ్ణి. ఎప్పుడూ చావడానికి సంసిద్ధుణ్ణే. నీ వల్ల కలిగిన భయాందోళన నేను అనుభవించాను. నేను కేవలం కలవరపడ్డవాణ్ణి.

[16] నా మీదుగా నీ తీవ్ర కోపం వచ్చింది. నీ వల్ల కలిగిన భయోద్రేకాలు నన్ను చంపివేశాయి.

[17] రోజంతా నీళ్ళలాగా అవి నన్ను కమ్మాయి. అవి నన్ను చుట్టుకొని ఉన్నాయి.

[18] నా ఆప్తులనూ, మిత్రులనూ నీవు నాకు దూరం చేశావు. అంధకారమే నా స్నేహితులు.

కీర్తనలు — Chapters