[1] దేవా, నీవు మౌనం వహించకు! నిశ్శబ్దంగా ఉండబోకు! ఊరుకోబోకు, దేవా!
[2] ఇరుగో నీ శత్రువులు ఘోషిస్తున్నారు. నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు.
[3] నీ ప్రజలమీద వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. నీలో దాక్కొన్నవారిని గురించి వాళ్ళు దురాలోచన చేస్తున్నారు.
[4] వాళ్ళిలా చెప్పుకొంటున్నారు: “ఇస్రాయేల్ అనే పేరు కూడా ఇక నుంచి జ్ఞప్తికి రాకుండా చేద్దాం. వాళ్ళ జాతిని నిర్మూలం చేసేద్దాం పట్టండి.”
[5] వాళ్ళు ఏకగ్రీవంగా సమాలోచన చేశారు. నీకు వ్యతిరేకంగా సంధి చేసుకొన్నారు.
[6] వాళ్ళు ఎదోం దేశ నివాసులూ, ఇష్మాయేల్‌జాతి వాళ్ళూ, మోయాబ్‌దేశం వాళ్ళూ, హగ్రీ జాతి వాళ్ళూ,
[7] గెబల్‌జాతి వాళ్ళూ, అమ్మోన్‌దేశం వాళ్ళూ, అమాలేక్‌జాతి వాళ్ళూ, ఫిలిష్తీయ దేశస్థులూ, తూరు నివాసులూ.
[8] అష్షూరు దేశం వాళ్ళ పక్షాన చేరింది. లోత్ వంశీకులకు చేయూత ఇస్తున్నారు. (సెలా)
[9] నీవు మిద్యానువాళ్ళను ఏమి చేశావో, కీషోన్‌ఏటి రేవున సీసెరానూ యాబీన్‌నూ ఏమి చేశావో అదే వీళ్ళనూ చెయ్యి.
[10] వాళ్ళు ఎన్‌దోరు దగ్గర నాశనమైపొయ్యారు. భూమికి పెంట అయ్యారు.
[11] ఓరేబ్, జెయేబ్‌నాయకులకు నీమూలంగా సంభవించినదంతా వీళ్ళ సామంతులకు జరిగేలా చెయ్యి! జెబహు, సల్‌మున్నాలకు సంభవించినదంతా వీళ్ళ అధిపతులకు కూడా జరిగేలా చెయ్యి!
[12] “దేవుడి నివాసాలు మనం ఆక్రమించుకుందాం” అని వాళ్ళు చెప్పుకొంటున్నారు.
[13] నా దేవా, వాళ్ళను సుడి తిరిగే దుమ్ము లాగా, గాలి చేత కొట్టుకుపొయ్యే పొట్టులాగా చెయ్యి.
[14] అగ్ని అడవిని కాల్చివేసినట్టు, కారు చిచ్చు కొండలను తగలబెట్టినట్టు
[15] నీ తుఫానుతో వాళ్ళను పారదోలు! నీ సుడి గాలి చేత వాళ్ళకు భయం కలిగించు!
[16] యెహోవా, మనుషులు నిన్ను వెదికేలా వాళ్ళ ముఖాలను పూర్తిగా సిగ్గుపాలు చేయి!
[17] వాళ్ళు నిత్యమైన అవమానం, భయం అనుభవించాలి, ఆశాభంగం పొంది నాశనం కావాలి.
[18] యెహోవా అనే పేరుగల నీవు మాత్రమే లోకమంతట్లో సర్వాతీతుడైన దేవుడని వారు తెలుసుకొంటారు గాక!