[1] యెహోవా, దుర్మార్గుల బారినుంచి నన్ను విడిపించు. దౌర్జన్యపరుల బారినుంచి నన్ను కాపాడు.
[2] వాళ్ళు తమ హృదయాలలో చెడు విషయాలు కల్పిస్తారు. ఎప్పుడూ యుద్ధం రేపాలని చూస్తారు.
[3] పాము నాలుకల్లాగా తమ నాలుకలకు పదును పెట్టుకుంటారు. వాళ్ళ పెదవుల క్రింద నాగు విషం ఉంది. (సెలా)
[4] యెహోవా, దుర్మార్గుల చేతులలో పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల బారినుంచి నన్ను రక్షించు. నేను కాలు జారిపడేలా చేయడానికి వాళ్ళు ఉపాయం పన్నుతున్నారు.
[5] ఆ గర్విష్ఠులు నన్ను చేజిక్కించుకోవడానికి ఉరి, ఉచ్చు చాటుగా పరిచారు. దారి ప్రక్కనే వల వేశారు. బోనులు ఉంచారు. (సెలా)
[6] నేను యెహోవాతో ఇలా చెపుతున్నాను: “నా దేవుడంటే నీవే!” యెహోవా, నా విన్నపం చెవిని బెట్టు.
[7] యెహోవా ప్రభూ! బలాఢ్యుడివైన నా రక్షకా! యుద్ధం జరిగే రోజున నీవు నా తల పోకుండా కాపాడేవాడివి.
[8] యెహోవా! దుర్మార్గులు ఆశించేవాటిని ప్రసాదించకు. వాళ్ళ కుట్ర సఫలమయ్యేలా చేయకు. వాళ్ళు మరీ గర్వంతో రెచ్చిపోతారు. (సెలా)
[9] నా చుట్టూరా ఉన్న ఈ మనుషుల నెత్తి మీదికే వారి పెదవుల కీడు వస్తుంది గాక!
[10] కణకణమండే నిప్పు రవ్వలు వాళ్ళ మీద రాలుతాయి గాక! తిరిగి లేవకుండా అగ్నిగుండంలో వాళ్ళు కూలిపోతారు గాక! దౌర్జన్యపరులను విపత్తులు వెంటాడి తరిమి పడదోస్తాయి గాక!
[11] దూషించేవాళ్ళకు భూమి మీద స్థావరం లేకుండా పోతుంది గాక! లోతైన నీళ్ళలోకి పడిపోతారు గాక!
[12] దీనావస్థలో ఉన్న భక్తుల తరఫున యెహోవా వాదిస్తాడు. దరిద్రులకు ఆయన న్యాయం చేకూరుస్తాడు. ఈ సంగతి నాకు తెలుసు.
[13] నిశ్చయంగా న్యాయవంతులు నీ పేరుకు కృతజ్ఞతలు అర్పిస్తారు. నిజాయితీపరులు నీ దగ్గరే ఉంటారు.