Skip to content
Opens in a new window

[1] యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇస్రాయేల్‌వారికి ఆయన పేరు పూజ్యం.

[2] షాలేంలో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన ఆలయం ఉంది.

[3] అక్కడ మండుతున్న వింటి బాణాలు విరిచివేశాడు. డాలు, ఖడ్గం, యుద్ధం ఆయన ఛిన్నా భిన్నం చేశాడు. (సెలా)

[4] దేవా, నీవు తేజోస్వరూపివి. అడవి మృగాలు ఉన్న పర్వతాల అందం ఎదుట నీ శోభ ఎంతో గొప్పది.

[5] ధైర్యం గల బలాఢ్యులను దోచుకోవడం జరిగింది. వాళ్ళు కన్నుమూశారు. ఆ వీరుల చేతులు ఏమైపొయ్యాయో వాళ్ళకే కనబడలేదు.

[6] యాకోబుయొక్క దేవా, నీవు గద్దిస్తే రౌతులకూ గుర్రాలకూ గాఢ నిద్ర పట్టింది.

[7] నీవు భయభక్తులకు పాత్రుడివి, నీవు మాత్రమే. నీవే గనుక కోపగిస్తే నీ ఎదుట ఎవరు నిలువగలరు?

[8] లోకానికి వినబడేలా నీవు పరలోకంనుంచి తీర్పు చెప్పావు.

[9] దేశమంతటా దీనదశలో ఉన్న తన భక్తులను రక్షించడానికి దేవుడు లేచాడు. అప్పుడు భూమి భయంతో మౌనం వహించింది. (సెలా)

[10] దేవా, మనుషుల కోపం ఫలితంగా నీకు స్తుతి కలుగుతుంది. మిగతా కోపాన్ని ఆయుధంగా ధరించుకొంటావు.

[11] మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మ్రొక్కుబడులను అర్పించండి. ఆయన చుట్టూరా ఉన్నవారందరూ భయభక్తులకు పాత్రుడైన దేవునికి కానుకలు తీసుకురావాలి.

[12] పరిపాలకుల గర్వాన్ని ఆయన అణచివేస్తాడు. ఆయన అంటే భూరాజులు భయపడాలి.

కీర్తనలు — Chapters