[1] యెహోవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవే నా బలం.
[2] యెహోవా నాకు ఆధారశిల, నా కోట, నా రక్షకుడు, నేను ఆశ్రయించిన నా ఆధారశిల, నా డాలు, నా రక్షణ బలం, నా ఎత్తయిన స్థలం, నా దేవుడు.
[3] యెహోవా స్తుతికి యోగ్యుడు. ఆయనకు నేను ప్రార్థన చేస్తాను. నా శత్రువుల బారి నుంచి ఆయన నన్ను తప్పిస్తాడు.
[4] మరణం పగ్గాలు నన్ను చుట్టివేశాయి. నాశన ప్రవాహాలు నా పైకి ముంచుకు వచ్చాయి.
[5] మృత్యులోక పాశాలు నన్ను చుట్టుకున్నాయి. మరణం ఉరిగా నన్ను ఎదుర్కొంది.
[6] నా కష్టాలలో యెహోవాకు ప్రార్థన చేశాను. సహాయంకోసం నా దేవునికి మొర పెట్టాను. నా కంఠధ్వని ఆయన తన ఆలయంలో విన్నాడు. నా ఆక్రందన ఆయన సన్నిధానానికి చేరింది, ఆయన చెవులకు వినబడింది.
[7] అప్పుడు భూకంపం వచ్చింది. భూమి అదిరింది. పర్వతాల పునాదులు కదిలాయి. ఆయనకు కోపం రగులుకొంది, గనుకనే అవి వణికాయి.
[8] ఆయన ముక్కుపుటాలలో నుంచి పొగ లేచింది. ఆయన నోటనుంచి దహించే మంట వచ్చింది. దానివల్ల నిప్పుకణికెలు రగులుకొన్నాయి.
[9] ఆకాశాలను చీల్చి ఆయన దిగి వచ్చాడు. కటిక చీకటి ఆయన పాదాల క్రింద ఉంది.
[10] కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు. గాలి రెక్కల మీద వేగంగా వచ్చాడు.
[11] ఆయన చీకటిని కప్పుకొన్నాడు. నీళ్ళున్న నల్లటి ఆకాశ మేఘాలను గుడారంలాగా ఆయనను చుట్టుకొన్నాయి.
[12] ఆయన ప్రకాశ మానమైన సన్నిధిలోనుంచి తన కారు మబ్బులు సాగిపొయ్యాయి. వడగండ్లూ, నిప్పుకణికెలూ బయలుదేరాయి.
[13] యెహోవా ఆకాశంలో గర్జించాడు. సర్వాతీతుడు తన స్వరం వినబడేలా చేశాడు. వడగండ్లు, నిప్పు రవ్వలు కురిశాయి.
[14] ఆయన తన బాణాలు విసిరాడు, శత్రువులను చెదరగొట్టాడు. అనేక మెరుపులు ప్రయోగించి వాళ్ళను ఓడించాడు.
[15] యెహోవా, నీ గద్దింపుకు, నీ ముక్కుపుటాలలో నుంచి వెలువడ్డ తీవ్ర శ్వాసకు సముద్రాల అడుగులు కనబడ్డాయి, భూగోళం పునాదులు కనిపించాయి.
[16] పైనుంచి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకొన్నాడు. నన్ను లోతైన నీళ్ళలో నుంచి పైకి తీశాడు.
[17] బలిష్ఠుడైన నా శత్రువు బారినుంచి ఆయన నన్ను రక్షించాడు. నా శక్తికి మించిన నా పగవాళ్ళ వశంనుంచి నన్ను తప్పించాడు.
[18] విపత్తులో వాళ్ళు నన్ను ఎదుర్కొన్నారు. కాని, యెహోవా నాకు అండదండగా ఉన్నాడు.
[19] ఆయన నన్ను విశాల స్థలంలోకి చేర్చాడు. నేనంటే ఆయనకెంతో ఇష్టం, గనుక నన్ను విడిపించాడు.
[20] నా న్యాయ ప్రవర్తన ప్రకారం యెహోవా నా పట్ల వ్యవహరించాడు. నా పవిత్ర క్రియల ప్రకారం నాకు ప్రతిఫలం ప్రసాదించాడు.
[21] యెహోవా విధానాలను నేను అనుసరించాను. నేనేమీ నా దేవుణ్ణి విడిచిన భ్రష్టుణ్ణి కాను.
[22] ఆయన న్యాయ నిర్ణయాలన్నీ శిరసావహిస్తున్నాను. ఆయన విధించిన చట్టాలను నేను ఉల్లంఘించడం లేదు.
[23] ఆయన పట్ల నేను నిర్దోషిని. నా చెడుగుకు లొంగకుండా నన్ను కాపాడుకొన్నాను.
[24] నా న్యాయ ప్రవర్తన ప్రకారం, ఆయన దృష్టిలో నా పవిత్ర క్రియల ప్రకారం, యెహోవా నన్ను సత్కరించాడు.
[25] దయాపరుల పట్ల నీవు దయ చూపుతావు. యథార్థంగా ప్రవర్తించే వారికి నీవు యథార్థవంతుడివి.
[26] పవిత్రులకు నిన్ను నీవు పవిత్రుడుగా కనుపరచుకొంటావు. కానీ వక్రబుద్ధులను వక్రమార్గం పట్టిస్తావు.
[27] దీనస్థితిలో ఉన్న నీ భక్తులను రక్షిస్తావు. గర్వంతో కన్ను మిన్నుగానని వాళ్ళను అణగగొట్టివేస్తావు.
[28] నా దీపం వెలిగేలా చేస్తావు నీవు. యెహోవా నా దేవుడు. ఆయన నా చీకటిని కాంతిగా మార్చివేస్తాడు.
[29] నీ సహాయంతో నేను సైన్యంపై బడగలను. నా దేవుని తోడ్పాటుతో గోడమీదుగా దూకెయ్యగలను.
[30] దేవుని మార్గం లోపరహితం. యెహోవా వాక్కు పవిత్రమైనది. ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ ఆయన డాలులాంటివాడు.
[31] యెహోవా తప్ప దేవుడు మరింకెవరు? మన దేవుడు తప్ప ఆధారశిలలాంటివాడు ఇంకెవరున్నారు?
[32] నాకు బలాన్ని కట్టబెట్టి, నా మార్గాన్ని ఏ లోపమూ లేకుండా చేసేవాడు ఆయనే.
[33] నా కాళ్ళు జింక కాళ్ళలాగా ఉండేలా చేసి, నా ఎత్తయిన స్థలాల మీద నన్ను నిలుపుతున్నాడు.
[34] యుద్ధం కోసం నా చేతులకు మంచి శిక్షణ ఇస్తున్నాడు. నాచేతులతో కంచు విల్లు ఎక్కు పెట్టగలను.
[35] నీ సంరక్షణ అనే డాలు నాకందించావు. నీ కుడి చెయ్యి నాకు అండదండగా ఉంటుంది. నీ విధానం సాధువైనది. అది నన్ను పై స్థితికి తెచ్చింది.
[36] నా పాదాలు మోపడానికి విశాల స్థలం ఇచ్చావు. నా కాలు జారలేదు.
[37] నా శత్రువులను వెంటాడి పట్టుకొన్నాను. వాళ్ళను నాశనం చేసేవరకు నేను వెనక్కు తిరగలేదు.
[38] మళ్ళీ లేవకుండా వాళ్ళను పూర్తిగా చితగ్గొట్టివేశాను. వాళ్ళు నా పాదాలకింద కూలారు.
[39] యుద్ధంకోసం నీవు నాకు బలాన్ని కట్టబెట్టావు. నన్ను ఎదిరించిన వాళ్ళను నాకు లొంగిపొయ్యేలా చేశావు.
[40] నా శత్రువులు వెన్ను చూపి పారిపొయ్యేలా చేశావు. నన్ను ద్వేషించినవాళ్ళను నేను నాశనం చేశాను.
[41] వాళ్ళు సహాయంకోసం అరిచారు గాని, వాళ్ళకు రక్షకుడెవడూ లేడు. యెహోవాకు మొరపెట్టినా ఆయన వినలేదు.
[42] నేను వాళ్ళను నుగ్గునుగ్గుగా చేసి విడిచాను. గాలికి లేచిపొయ్యే దుమ్ములాగా అయిపొయ్యారు. వీధి కసువు ఊడ్చి పోసినట్టు వాళ్ళను ఎత్తిపోశాను.
[43] ఈ జనం కలహాలలో పడిపోకుండా నన్ను కాపాడావు. వేరు వేరు ప్రజలకు నన్ను అధిపతిని చేశావు. ఇంతకు ముందు నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తున్నారు.
[44] నన్ను గురించి వినీ వినడంతోనే వాళ్ళు నాకు విధేయులవుతున్నారు. నాకు లొంగినట్టే విదేశీయులు నటిస్తున్నారు.
[45] విదేశీయులకు గుండెలు జారుతాయి. వణకుతూ వాళ్ళ కోటలలో నుంచి బయటికి వస్తారు.
[46] యెహోవా సజీవుడు! నాకు ఆధార శిలలాంటి ఈ దేవునికి స్తుతి! నా రక్షకుడైన దేవునికి ప్రశంస కలుగు గాక!
[47] నా పక్షంగా ఆయనే పగ తీర్చేవాడు, ప్రజలను నా వశం చేసేవాడు,
[48] నా శత్రువుల బారి నుంచి నన్ను రక్షించేవాడు, నాపైబడ్డ వాళ్ళకు పైగా నన్ను ఉంచేవాడు, దౌర్జన్యపరుల చేతిలో నుంచి నన్ను తప్పించేవాడు.
[49] అందుచేత, యెహోవా, జనాల మధ్య నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను, నీ నామసంకీర్తనం చేస్తాను.
[50] ఆయన నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయం చేకూరుస్తున్నాడు. ఆయన అభిషిక్తుడికి దావీదుకు, అతడి సంతానానికి శాశ్వతంగా అనుగ్రహం చూపుతాడు.