[1] యెహోవా, న్యాయ సమ్మతమైన ఫిర్యాదు ఆలకించు, నా ఆక్రందన విను. నా ప్రార్థన నిష్కపటమైన పెదవుల నుంచి వస్తూ ఉంది. నా ప్రార్థన విను.
[2] నీ చూపులు న్యాయంమీదే ఉంటాయి. నాకు సరైన తీర్పు నీ సన్నిధానంనుంచి వస్తుంది గాక!
[3] నా హృదయాన్ని పరిశోధించావు. రాత్రివేళ నన్ను సందర్శించావు. నీవు నన్ను పరీక్షించావు. నాలో చెడ్డ ఉద్దేశాలేమీ లేకపోవడం చూశావు. మాటల్లో అతిక్రమం చేయనని నిశ్చయించుకొన్నాను.
[4] మనుషుల క్రియాకలాపాల విషయమైతే, నీ నోటి మాటల మూలంగా దౌర్జన్యం చేసేవాళ్ళ మార్గం నుంచి తప్పించుకొన్నాను.
[5] నా పాదాలు నీ దారినే అంటిపెట్టుకొని ఉన్నాయి. అవి జారలేదు.
[6] దేవా, నీవు నాకు జవాబిస్తావని నీకు మొర పెట్టాను. నాకు చెవి ఒగ్గు. నా మాటలు ఆలకించు.
[7] కుడి చేతిలో నీ శరణాగతులను శత్రువుల బారినుంచి రక్షించేవాడా, ఆశ్చర్యకరమైన నీ అనుగ్రహం నాకు చూపు!
[8] దుర్మార్గులు నన్ను నాశనం చెయ్యాలని చూస్తున్నారు.
[9] వాళ్ళ చేతిలో చిక్కకుండేలా నీ కనుపాపలాగా నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
[10] వాళ్ళు కఠిన హృదయులు. వాళ్ళ నోట గర్వం ఉట్టిపడుతుంది.
[11] మా అడుగు జాడలను బట్టి వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చుట్టుముట్టారు. మమ్మల్ని నేల కూల్చాలని గురి పెట్టి చూస్తున్నారు.
[12] వాళ్ళు ఎప్పుడు చీల్చివేద్దామా అని పొంచి ఉన్న సింహంలాగా, చాటుగా నక్కివున్న కొదమ సింహంలాగా ఉన్నారు.
[13] యెహోవా, లే! వాళ్ళను ఎదుర్కొని కూలద్రొయ్యి. దుర్మార్గుల చేతిలో నుంచి నీ ఖడ్గంతో నన్ను తప్పించు.
[14] ఈ మనుషులు లౌకిక విచారం గలవాళ్ళు, వీళ్ళ వంతు ఈ జీవితంలోనే ఉంది. ఇలాంటి వాళ్ళ బారినుండి నీ చేతిబలంతో నన్ను రక్షించు. వాళ్ళ కడుపు మంచి పదార్థాలతో నింపుతావు. వాళ్ళు చాలా మంది పిల్లలను కని తృప్తి చెందుతారు. తమ ఆస్తిపాస్తులు తమ పిల్లలకు విడిచి పెట్టి పోతారు.
[15] నేనైతే న్యాయవర్తనుణ్ణి. నీ ముఖదర్శనం నాకు కలుగుతుంది. నేను లేచేటప్పుడు నీ స్వరూపాన్ని చూచి తృప్తి చెందుతాను.