Skip to content
Opens in a new window

[1] యెహోవాను గురించి క్రొత్త పాట పాడండి. సర్వలోక ప్రజలారా, యెహోవాను సంకీర్తనం చేయండి,

[2] యెహోవా పాటలు పాడండి, ఆయన పేరును స్తుతించండి. ప్రతి రోజూ ఆయన రక్షణను చాటించండి.

[3] ఇతర జనాలలో ఆయన మహిమను తెలియజేయండి. అన్ని దేశాల ప్రజలలో ఆయన అద్భుతాలను వివరించండి.

[4] యెహోవా గొప్పవాడు. ఆయన అత్యంత స్తుతికి యోగ్యుడు. దేవుళ్ళందరికంటే భయభక్తులకు పాత్రుడు.

[5] ఎందుకంటే, జనాల దేవుళ్ళంతా విగ్రహాలు మాత్రమే. యెహోవా ఆకాశాలను సృజించాడు.

[6] ఘనత, వైభవం ఆయన సన్నిధానంలో ఉన్నాయి. బలం, శోభ ఆయన పవిత్రాలయంలో ఉన్నాయి.

[7] జనాంగాల్లారా, యెహోవాకు ఆరోపించండి, మహత్తు, బలం యెహోవాకు ఆరోపించండి.

[8] యెహోవా పేరుకు చెందే మహత్తు ఆయనకు ఆరోపించండి. నైవేద్యం చేతపట్టుకొని ఆయన ఆవరణాలలో ప్రవేశించండి.

[9] పవిత్రత అనే అలంకారంతో యెహోవాను ఆరాధించండి. సర్వలోక ప్రజలారా! ఆయన సమక్షంలో వణకండి.

[10] జనాలలో ఇలా ప్రకటించండి: “యెహోవా పరిపాలన చేస్తున్నాడు.” లోకం స్థిరంగా ఉంది. అది కదలదు. ఆయన పక్షపాతం లేకుండా జనాలకు తీర్పు తీరుస్తాడు.

[11] యెహోవా రాబోతున్నాడు! యెహోవా ఎదుట ఆకాశాలు ఆనందిస్తాయి గాక! భూమి సంతోషిస్తుంది గాక! సముద్రం, దానిలో ఉన్నదంతా హోరుమంటుంది గాక!

[12] మైదానాలు, వాటిలో ఉన్నదంతా ఆనంద ధ్వనులు చేస్తాయి గాక! అడవి చెట్లన్నీ ఉత్సాహంతో కేకలు వేస్తాయి గాక!

[13] ఎందుకంటే, యెహోవా రాబోతున్నాడు. భూమిమీది ప్రజానీకానికి తీర్పు తీర్చడానికి ఆయన వేంచేస్తున్నాడు. ఆయన న్యాయంతో లోక ప్రజలకు తీర్పు తీరుస్తాడు. తన సత్యాన్ని అనుసరించి జనాలకు న్యాయం చేకూరుస్తాడు.

కీర్తనలు — Chapters