[1] దేవుడు లేస్తాడు. ఆయన శత్రువులు చెదరిపోతారు. ఆయన అంటే ద్వేషం ఉన్నవాళ్ళంతా ఆయన ఎదుటనుంచి పారిపోతారు.
[2] పొగ చెదరిపోయినట్లు నీవు వాళ్ళను చెదరగొట్టివేస్తావు. మైనం అగ్నికి కరిగిపోయినట్లు దుర్మార్గులు దేవుని ఎదుట నాశనమైపోతారు.
[3] న్యాయవంతులు ఆనందిస్తారు. దేవుని సన్నిధానంలో సంతోషిస్తారు. వారు అమితానందం అనుభవిస్తారు.
[4] దేవునికి సంకీర్తనం చేయండి. ఆయన పేరుకు స్తుతిగీతం పాడండి. ఆయన ఎడారి ప్రదేశాలగుండా వాహనమెక్కి ప్రయాణం చేసేవాడు. ఆయనకు రాజమార్గం సిద్ధం చెయ్యండి. ఆయన పేరు యెహోవా. ఆయనయెదుట ఆనంద పారవశ్యం పొందండి.
[5] తన పవిత్రాలయంలో ఉంటూ, దేవుడు తండ్రి లేని వాళ్ళకు తండ్రిగా ఉన్నాడు, విధవరాండ్రకు న్యాయం చేకూర్చేవాడు.
[6] ఒంటరివాళ్ళను ఇండ్లలో నివసించేలా చేసే దేవుడు ఆయన. ఖైదీలను విడుదల చేసి, వాళ్ళను అభివృద్ధిలోకి నడిపిస్తాడు. తిరుగబడేవాళ్ళు మాత్రమే ఎండిన ప్రదేశాల్లో ఉండిపోతారు.
[7] దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, ఎడారిలోనుంచి నీవు ప్రయాణమయినప్పుడు, (సెలా)
[8] భూమి కంపించింది, దేవుని సమక్షంలో మిన్ను విరిగిపడింది. దేవుని ఎదుట ఇస్రాయేల్‌ప్రజల దేవుని ఎదుట సీనాయి పర్వతం గజగజలాడింది.
[9] దేవా! నీ సొత్తయిన దేశంమీద సమృద్ధిగా వర్షం కురిపించావు. అది నీరసించిపోయినప్పుడు దానిని సుస్థిరం చేశావు.
[10] నీ మంద అందులో నివాసం ఏర్పరచుకొంది. దేవా, నీ మంచితనం అనుసరించి పేదలకు వసతి కల్పించావు.
[11] ప్రభువు మాట చెప్పాడు. స్త్రీలు ఓ పెద్ద సైన్యంగా దానిని ఇలా ప్రకటించారు:
[12] “సైన్యాలు ఉన్న రాజులు పారిపోయారు, పారిపోయారు. ఇంటిపట్టున ఉన్న స్త్రీలు దోపిడీసొమ్ము పంచుకొంటారు.”
[13] గొర్రెల దొడ్లలో మీరు విడిది చేసి ఉంటే చూడడానికి గువ్వల రెక్కలకు వెండి తాపడం చేసినట్టు ఉంది. వాటి ఈకెలకు మేలిమి బంగారు పూత పూసినట్టుంది.
[14] అక్కడ అమిత శక్తిమంతుడు రాజులను చెదరగొట్టివేస్తూ ఉంటే సలమన్‌మీద మంచు కురిసినట్లనిపించింది.
[15] బాషాను పర్వతపంక్తి కూడా దేవునిది. బాషాను పర్వత పంక్తికి అనేక శిఖరాలున్నాయి.
[16] అనేక శిఖరాలతో వెలుగొందే పర్వతాల్లారా! దేవుడు తన నివాసంగా నియమించిన పర్వతాన్ని ఎందుకలా చూస్తూ అసూయపడుతున్నారు? యెహోవా అక్కడే నివాసముంటాడు.
[17] దేవుని రథాలు వేలాది వేలు. ప్రభువు వాటిమధ్య సీనాయిదగ్గర పవిత్ర స్థలంలో ఉండేవాడు.
[18] నీవు ఆరోహణమైపొయ్యావు. ఖైదీలను నీవు చెరపట్టి తీసుకుపోయావు. మనుషులలోనుంచి నీవు ఈవులు స్వీకరించావు. యెహోవా దేవా, నీవు అక్కడ నివసించేలా తిరుగుబాటు చేసినవాళ్ళలో నుంచి కూడా నీవు ఈవులు స్వీకరించావు.
[19] ప్రభువుకు సంస్తుతి! ప్రతి రోజూ ఆయన మన భారం వహిస్తాడు. దేవుడే మన రక్షణ. (సెలా)
[20] మన దేవుడు రక్షించే దేవుడు. యెహోవా అనే ప్రభువే మరణంనుంచి తప్పించేవాడు.
[21] దేవుడు తన శత్రువుల తలలను చితగ్గొట్టివేస్తాడు. ఇది ఖాయం. అపరాధాలు చేయడం మాననివాళ్ళ మాడు మీద కొట్టితీరుతాడు.
[22] ప్రభువు చెప్పినదేమంటే, “బాషానులోనుంచి మిమ్ములను రప్పిస్తాను. సముద్రం లోతుల్లో నుంచి మిమ్ములను రప్పిస్తాను.
[23] మీ శత్రువుల నెత్తురును మీ కాళ్ళక్రింద తొక్కివేస్తారు. వాళ్ళు మీ కుక్కల నాలుకల పాలవుతారు.”
[24] దేవా, నీ ఊరేగింపును వాళ్ళు చూశారు, నా రాజైన దేవుడు పవిత్రాలయానికి ఊరేగడం వాళ్ళు చూశారు.
[25] గాయకులు ముందు నడిచారు. వాళ్ళ వెంట వాయిద్యగాండ్లు నడిచారు. కంజరీలు వాయిస్తూ వారిమధ్య కన్యలు నడిచారు.
[26] సమాజాలలో దేవుణ్ణి స్తుతించండి. ఇస్రాయేల్ ఊటలో నుంచి వచ్చిన వాళ్ళంతా ప్రభువును స్తుతించండి.
[27] అక్కడ బెన్యామీను అనే చిన్న గోత్రంవారు ఉన్నారు. అది పరిపాలన చేసే గోత్రం. యూదా నాయకులు వారి పరివారంతో అక్కడ ఉన్నారు. జెబూలూను నాయకులు, నఫ్తాలి నాయకులు ఉన్నారు.
[28] నీ దేవుడు నీకు బలం ఉండాలని నియమించాడు. దేవా, నీవు మాకోసం ఇది జరిగించావు. నీ బలం కనుపరచుకో!
[29] జెరుసలంలోని నీ పవిత్రాలయం కారణంగా రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
[30] జమ్ము గడ్డిలో ఉండే మృగాలను, ఎద్దుల గుంపును ఖండించు. దూడల్లాంటి జనాన్ని మందలించు. వీళ్ళు లొంగిపోయి కప్పంగా వెండి తెచ్చేలా చెయ్యి. యుద్ధాలంటే ఇష్టపడే వారిని దేవుడు చెదరగొట్టాడు.
[31] ఈజిప్ట్‌నుంచి ప్రముఖులు వస్తారు. కూషు దేవుని వైపు త్వరలో చేతులు చాపుతుంది.
[32] ఇహలోక రాజ్యాలూ! దేవుణ్ణి గురించి పాడండి! ప్రభు సంకీర్తనం చెయ్యండి! (సెలా)
[33] అనాది కాలంనుంచి ఉన్న మహాకాశాలలో ఆయన వాహనమెక్కి ప్రయాణమయ్యేవాడు. ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. ఆయన స్వరం బలమైనది.
[34] దేవునికి మహా బలం ఉందని చాటండి. ఇస్రాయేల్‌మీద ఆయన ప్రతాపం ఉంది. అంతరిక్షంలో ఆయన మహా బలం ఉంది.
[35] తన పవిత్రాలయంలో ఆయన భయభక్తులు కలిగించే దేవుడు. ఇస్రాయేల్‌ప్రజల దేవుడు తానే వారికి బలప్రభావాలను ప్రసాదిస్తాడు. దేవునికి సంస్తుతి!