Skip to content
Opens in a new window

[1] యెహోవాకు కృతజ్ఞత అర్పించండి. ఆయన పేర ప్రార్థన చేయండి. ఆయన క్రియలను జనాలకు తెలపండి.

[2] ఆయనను ఉద్దేశించి పాటలు పాడండి, స్తుతి గీతాలు చేయండి. ఆయన చేసే అద్భుతాలన్నిటిని గురించి కబుర్లాడుకోండి.

[3] ఆయన పవిత్రమైన పేర అతిశయించండి. యెహోవాను వెదికేవారి హృదయం ఆనందిస్తుంది.

[4] యెహోవాను, ఆయన బలాన్ని వెదకండి. ఆయన ముఖ సందర్శనాన్ని ఎప్పటికీ వెదకండి.

[5] ఆయన సేవకుడైన అబ్రాహాము వంశమా! ఆయన ఎన్నుకొన్న యాకోబు సంతానమా!

[6] ఆయన చేసిన అద్భుతాలను జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన చేసిన ఆశ్చర్యకరమైన క్రియలు, ఆయన నోటినుంచి వెలువడే న్యాయ నిర్ణయాలు జ్ఞాపకం చేసుకోండి.

[7] ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు లోకంలో అంతటా జరుగుతున్నాయి.

[8] తాను చెప్పిన మాట వెయ్యి తరాలు ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు.

[9] ఇస్సాకుకు ఆయన చేసిన ప్రమాణం, ఆయన ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటాడు.

[10] ఆయన దానిని యాకోబుకు చట్టంగా స్థిరపరచాడు. ఇస్రాయేల్‌కు శాశ్వతమైన ఒప్పందంగా సుస్థిరం చేశాడు.

[11] ఆయన మాట ఇచ్చాడు – “కనానుదేశం మీకు వారసత్వంగా ఇస్తాను. అది మీ భాగం”.

[12] అప్పుడు వారిని సులభంగా లెక్క పెట్టవచ్చు. ఆ కొద్దిమంది ఆ దేశంలో పరాయివారుగా ఉన్నారు.

[13] దేశంనుంచి దేశానికి తిరుగాడారు వారు. ఒక రాజ్యంనుంచి ఇంకో రాజ్యానికి తిరిగారు.

[14] యెహోవా “నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు. నా ప్రవక్తలకు హాని చెయ్యకూడదు” అంటూ

[15] ఎవరినీ వారికి హాని చెయ్యనియ్యలేదు. వారి పక్షాన రాజులను ఆయన హెచ్చరించాడు.

[16] కనాను దేశానికి కరవు వచ్చేలా చేశాడాయన. జీవనాధారమైన ఆహారం దొరకకుండా చేశాడు.

[17] వారికి ముందుగా ఆయన యోసేపును పంపాడు. వారు అతణ్ణి బానిసగా అమ్మివేశారు.

[18] అతని కాళ్లకు సంకెళ్ళు వేసి బాధించారు. ఇనుప గొలుసులతో అతణ్ణి బాధించారు.

[19] అతని మాట నెరవేరేవరకూ యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించింది.

[20] తరువాత రాజు కబురు పెట్టి, అతణ్ణి చెరసాలలో నుంచి విడిపించాడు. జనాల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.

[21] తన సామంతులను యోసేపు ఇష్టప్రకారం కట్టుబాటులో ఉంచడానికీ, తన పెద్దలకు జ్ఞానం కలిగించడానికీ

[22] తన ఇంటి మీద అతణ్ణి అధిపతిగా నియమించాడు. తన ఆస్తి అంతటిమీదా అతనికి యాజమాన్యం అప్పగించాడు.

[23] తరువాత ఇస్రాయేల్‌ఈజిప్ట్‌కు వచ్చాడు. హాము దేశంలో యాకోబు ప్రవాసం చేశాడు.

[24] యెహోవా తన ప్రజలకు అధిక సంతానాన్ని కలిగించాడు. శత్రువులకు మించిన బలం వారికి ఇచ్చాడు.

[25] అక్కడివారు తన ప్రజలను ద్వేషించేలా, తన సేవకుల పట్ల కపటంతో వ్యవహరించేలా వారి హృదయాలలో పని చేశాడు.

[26] ఆయన తన సేవకుడైన మోషేను పంపాడు. తాను ఎన్నుకొన్న అహరోనును పంపాడు.

[27] వారు వాళ్ళ మధ్య దేవుని ఆశ్చర్యకరమైన క్రియలు జరిగించారు. ఆ హాము దేశంలో అద్భుతాలు చేశారు.

[28] యెహోవా చీకటిని పంపాడు. చీకటి అంతటా ఆవరించేలా చేశాడు. వాళ్ళు ఆయన మాటకు ఎదురాడలేదా?

[29] వాళ్ళ నీళ్ళను నెత్తురుగా మార్చాడు. వాళ్ళ చేపలను ఈ విధంగా చంపాడు.

[30] వాళ్ళ దేశం కప్పలతో నిండిపోయింది. పరిపాలకుల ఇండ్లలోని గదులు కూడా వాటితో నిండిపోయాయి.

[31] ఆయన ఆజ్ఞ మేరకు జోరీగలు వచ్చాయి. వాళ్ళ దేశమంతటా దోమలు ముసురుకొన్నాయి.

[32] వాళ్ళ మీదికి వడగండ్ల వాన పంపాడాయన. వాళ్ళ దేశంలో మంటలు పుట్టించాడు.

[33] వాళ్ళ ద్రాక్షచెట్లూ, అంజూరు వృక్షాలూ పడగొట్టాడాయన. వాళ్ళ సరిహద్దులలో ఉన్నచెట్లను విరగ్గొట్టాడు.

[34] ఆయన ఆజ్ఞ ఇస్తే ఎగిరే మిడతలు వచ్చి పడ్డాయి. లెక్కలేనంతగా గొల్లభామ పురుగులు వచ్చాయి.

[35] వాళ్ళ దేశంలో పచ్చని మొక్కలన్నిటినీ అవి తినివేశాయి. వాళ్ళ పంట చేలను పొట్టన పెట్టుకొన్నాయి.

[36] వాళ్ళ దేశంలో మొదట పుట్టిన కొడుకులందరినీ ఆయన హతమార్చాడు. వాళ్ళ బలంవల్ల కలిగిన ఆ తొలి సంతానాన్ని ఆయన చంపాడు.

[37] ఆయన ఇస్రాయేల్‌వారిని బయటికి రప్పించాడు. వారు వెండి బంగారాలు తెచ్చారు. ఆయన గోత్రాలలో తొట్రుపడేవారెవరూ లేరు.

[38] వారంటే ఈజిప్ట్‌వాళ్ళకు భయం పట్టుకొంది. వారు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు సంతోష పడ్డారు.

[39] వాళ్ళను కప్పడానికి తెరలాగా మేఘాన్ని పరిచాడాయన. రాత్రిలో వెలుగుకోసం మంటలను దయచేశాడు.

[40] వారు కోరుకొన్నట్టే ఆయన పూరేడు పిట్టలను రప్పించాడు. ఆకాశం నుంచి వచ్చే ఆహారంతో వారిని తృప్తి పరిచాడు.

[41] ఆయన బండను చీల్చాడు. అందులో నుంచి నీళ్ళు ఉబికి వచ్చాయి. ఆ నీరు నదిలాగా ఎడారి స్థలాలలో పారింది.

[42] ఆయన తన పవిత్ర వాక్కునూ, తన సేవకుడైన అబ్రాహామునూ జ్ఞాపకం ఉంచుకొన్నాడు.

[43] ఆయన తన ప్రజలను సంతోషంతో బయటికి తీసుకువచ్చాడు. తాను ఎన్నుకొన్న ప్రజలను ఆనంద ధ్వనులతో రప్పించాడు.

[44] ఇతర ప్రజల భూములను ఆయన వీరికిచ్చాడు. వాళ్ళ కష్టార్జితం వీరు స్వాధీనం చేసుకొన్నారు.

[45] తద్వారా వారు తన చట్టాలను పాటించాలనీ, తన ఉపదేశాలను ఆచరణలో పెట్టాలనీ ఆయన ఇదంతా చేశాడు. యెహోవాను స్తుతించండి!

కీర్తనలు — Chapters