[1] దేవా! నిన్ను నమ్మి ఆశ్రయించాను. నన్ను కాపాడు.
[2] “నీవే నా యజమానివి. నీ మూలంగానే నా క్షేమమంతా” అని నేను యెహోవాతో అన్నాను.
[3] ఈ భూమి మీద నివసించే నీ పవిత్ర ప్రజలే మహనీయులు. వారి విషయంలోనే నాకు సంతోషం.
[4] యెహోవా తప్ప వేరే దేవుళ్ళను అనుసరించేవారికి కడగండ్లు ఎక్కువవుతాయి. వాళ్ళు రక్తం పానార్పణగా అర్పించేటప్పుడు నేను పాల్గొనను. వాళ్ళ దేవుళ్ళ పేర్లు కూడా నా పెదవులతో ఉచ్చరించను.
[5] యెహోవా నాకు వచ్చిన వంతు, నా అన్నపానాలు! నీవు నాకు పంచి పెట్టినదానిని నిర్వహిస్తావు.
[6] మనోహరమైన స్థలాలలో నాకు భాగం లభించింది. నా వారసత్వం చాలా శ్రేష్ఠమైనది.
[7] యెహోవా నాకు ఆలోచన చెప్పేవాడు. ఆయనను స్తుతిస్తాను. రాత్రిలో కూడా నా అంతరాత్మ నాకు ఉపదేశిస్తుంది.
[8] యెహోవా వైపే నేనెప్పుడూ చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడివైపున ఉన్నాడు. గనుక ఏదీ నన్ను కదల్చదు.
[9] అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక నా ఆనందాన్ని బయలు పరుస్తున్నది. నా శరీరం కూడా క్షేమంగా ఉంటుంది.
[10] ఎందుకంటే నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారవిడువవు. నీ పవిత్రుడైన నన్ను కుళ్ళి పోనియ్యవు.
[11] జీవ పథం నీవు నాకు చూపుతావు. నీ సన్నిధానంలో ఆనంద సమృద్ధి ఉంది. నీ కుడిచేతిలో శాశ్వత సంతోషాలు ఉన్నాయి.