Skip to content
Opens in a new window

[1] నన్ను దయ చూడు, దేవా, నన్ను దయ చూడు! నా అంతరంగం నీలో దాక్కొన్నది. ఈ నాశనకరమైన పరిస్థితులు గడిచిపోయేదాకా నీ రెక్కల నీడలో నేను దాక్కొంటాను.

[2] సర్వాతీతుడైన దేవునికి నేను మొర పెట్టుకొంటున్నాను. ఆయనే నాకోసం పని కొనసాగిస్తాడు.

[3] ఆయన పరలోకంనుంచి ఆజ్ఞ ఇస్తాడు. నన్ను విడిపిస్తాడు. నన్ను దిగమింగాలని చూచేవాళ్ళు నామీద చాడీలు పలుకుతూ ఉంటే దేవుడు తన అనుగ్రహమూ, సత్యమూ పంపుతాడు. (సెలా)

[4] సింహాలమధ్య నా ప్రాణం ఉంది. నిప్పులు వెళ్ళగ్రక్కే వాళ్ళమధ్య నేను పడుకోవలసివచ్చింది. ఈ మనుషుల పళ్ళు ఈటెలలాంటివి. అవి బాణాలే! వాళ్ళ నాలుక పదునైన కత్తిలాంటిది.

[5] దేవా, నీవు ఆకాశాలకంటే ఉన్నత స్థానంలో ఉన్నావని బయలుపరచు. భూతలమంతటిమీదా నీ మహిమ కనబడనియ్యి.

[6] నా పాదాలను చిక్కించుకోవాలని వారు వల వేశారు. నా ప్రాణం క్రుంగిపోయింది. నా కోసం వాళ్ళు గుంట తవ్వారు గాని, దానిలో వాళ్ళే పడ్డారు. (సెలా)

[7] నా హృదయం నిబ్బరంగా ఉంది, దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతాను, సంకీర్తనం చేస్తాను.

[8] నా మనసా! మేలుకోవే! మేలుకో! స్వరమండలమా, తంతివాద్యమా మేల్కోండి! నేను ప్రొద్దున్నే పెందలకడనే మేలుకుంటాను.

[9] నీ అనుగ్రహం ఆకాశాన్ని అంటేంత గొప్పది. నీ సత్యం మిన్నంటుతూ ఉంది.

[10] గనుక ప్రభూ! జనాలమధ్య నిన్ను సన్నుతిస్తాను. ఇతర జాతులమధ్య నిన్ను స్తుతిస్తాను.

[11] దేవా, నీవు ఆకాశాలకంటే ఉన్నత స్థానంలో ఉన్నావని బయలుపరచు. భూతలమంతటిమీదా నీ ఘనత కనబడనియ్యి.

కీర్తనలు — Chapters