Skip to content
Opens in a new window

[1] దేవా, మేము చెవులార విన్నాం, మా పూర్వీకుల రోజుల్లో, ఆ పురాతన కాలంలో, నీవు చేసినది వారు మాకు చెప్పారు.

[2] నీ సొంత చేతితో ఇతర జాతులను వెళ్ళగొట్టావు, మా పూర్వీకులను ఇక్కడ నిలబెట్టావు. నీవు ఆ ప్రజలను కీడులకు గురి చేశావు, మా పూర్వీకులు వ్యాపించేలా చేశావు.

[3] తమ కత్తితో ఈ దేశాన్ని వశం చేసుకోలేదు వారు. తమ భుజబలంతో విజయం సాధించలేదు. నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వీటి మూలంగానే విజయం సిద్ధించింది. నీవు వారిని కటాక్షించావు.

[4] దేవా, నీవే నా రాజువు. యాకోబు ప్రజలకు సంపూర్ణ విముక్తి కలిగించు.

[5] మా విరోధులను నీద్వారా పడదోసివేస్తాం. మా పైబడేవాళ్ళను నీ పేర అణగదొక్కివేస్తాం.

[6] నా ధనుస్సుమీద నేను నమ్మకం పెట్టను. నా ఖడ్గం నన్నేమీ గెలిపించదు.

[7] మా విరోధులమీద మాకు విజయం సాధించేది నీవే. మా పగవాళ్ళకు ఆశాభంగం కలిగించేది నీవే.

[8] దేవునిలోనే మాకు ఎడతెగని అతిశయం! నీ పేరును మేము శాశ్వతంగా స్తుతిస్తాం! (సెలా)

[9] ఇప్పుడైతే నీవు మమ్మల్ని విడిచి సిగ్గుపాలు చేశావు. మా సైన్యంతో నీవు రావడం లేదు.

[10] మా విరోధులకు వెన్ను చూపి పారిపొయ్యేలా చేశావు. మా పగవాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసుకొంటున్నారు.

[11] గొర్రెలలాగా మమ్మల్ని ఆహారంగా వారికిచ్చావు. ఇతర ప్రజలలో మమ్మల్ని చెదరగొట్టావు.

[12] తక్కువ వెలకు, లాభమేమీ పొందకుండా నీ ప్రజలను అమ్మివేశావు.

[13] మా ప్రక్కవారి దూషణకు మమ్మల్ని గురిచేశావు. చుట్టూ ఉన్న వాళ్ళకు మేమంటే మరీ వెటకారమూ, పరిహాసమూ అయిపొయ్యేలా చేశావు.

[14] ఇతర ప్రజల నోట నానిపొయ్యేలా మమ్మల్ని చేశావు. వారు మమ్మల్ని చూచి తలలూపేలా చేశావు.

[15] హేళన, దూషణ చేసేవాళ్ళ కారణంగా, పగ తీర్చుకొనే శత్రువుల సముఖం కారణంగా

[16] రోజంతా నాకు తలవంపులే. నా ముఖంమీది సిగ్గు నన్ను ఆవరించి ఉంది.

[17] ఇదంతా మా మీదికి వచ్చి పడింది. అయినా మేము నిన్ను మరువలేదు. నీ ఒడంబడిక విషయం నమ్మకద్రోహులం కాలేదు.

[18] మా హృదయం వెనక్కు తీయలేదు. మా పాదాలు నీ మార్గంనుంచి వైదొలగలేదు.

[19] నక్కలున్న చోట నీవు మమ్మల్ని బాగా నలగ్గొట్టావు. చావునీడ మమ్మల్ని ఆవరించేలా చేశావు.

[20] ఒకవేళ మేము మా దేవుని పేరు మరచి ఉంటే, పరాయి దేవుడివైపుకు చేతులు చాపి ఉంటే,

[21] దేవుడు ఈ విషయం పసిగట్టకపోతాడా? హృదయంలో దాగివున్న విషయాలు ఆయనకు తెలుసు.

[22] నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధకు తగ్గ గొర్రెలుగా మమ్మల్ని ఎంచుతున్నారు.

[23] ప్రభూ! మేల్కో! ఎందుకీ నిద్ర! లే! మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టి ఉండబోకు!

[24] నీవెందుకు ముఖం చాటు చేసుకొంటావు? మా బాధను, హింసను నీవెందుకు మరచిపోతావు?

[25] మా ప్రాణం నేలవరకు కుంగిపోయింది. మా శరీరం నేలకు అంటుకుపోయింది.

[26] లే! మాకు సహాయం చెయ్యి! నీ అనుగ్రహం కారణంగా మమ్మల్ని విడిపించు.

కీర్తనలు — Chapters