[1] దేవా, నన్ను దయ చూడు! మనుషులు నన్ను దిగమింగాలని తహతహలాడుతున్నారు. ప్రొద్దస్తమానం పోరాటమే. వాళ్ళు నన్ను వేధించుకు తింటున్నారు.
[2] చాలా మంది గర్విష్ఠులై నాతో యుద్ధానికి తలపడుతున్నారు. నా శత్రువులు అదేపనిగా నన్ను దిగమింగాలని తహతహలాడుతున్నారు.
[3] నాకు భయం కలిగే రోజున నీమీద నమ్మకం ఉంచుతాను.
[4] దేవునిమూలంగా నేను ఆయన వాక్కును కీర్తిస్తాను. దేవునిలో నమ్మకం పెట్టుకున్నాను. నేనేమీ భయపడను. శరీరులు నన్నేం చేయగలరు?
[5] రోజంతా వీళ్ళు నా మాటలకు విపరీతార్థం కల్పిస్తారు. నాకు ఎప్పటికీ కీడు చేయాలనే వాళ్ళ తలంపు.
[6] వాళ్ళు ముఠాగా పొంచి ఉంటారు. నా ప్రాణం తియ్యాలని నా అడుగులు చూస్తారు.
[7] దుర్మార్గం చేస్తూ వీళ్ళు తప్పించుకోగలరా? దేవా, కోపంతో ఈ ప్రజలను పడదొయ్యి!
[8] నేను పారిపోయి తిరుగాడుతూ ఉంటే నీవు లక్ష్య పెట్టావు. నా కన్నీళ్ళు నీ సీసాలో పట్టి ఉంచు! అవి నీ గ్రంథంలో రాసి ఉంచావు గదూ?
[9] నేను నిన్ను వేడుకుంటాను. ఆ రోజునే నా శత్రువులు వెనక్కు తగ్గుతారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఇది నాకు తెలుసు.
[10] దేవునిమూలంగా నేను ఆయన వాక్కును కీర్తిస్తాను. యెహోవామూలంగా ఆయన వాక్కును కీర్తిస్తాను.
[11] దేవునిలో నేను నమ్మకం పెట్టుకొన్నాను. నేనేమీ భయపడను. మనుషులు నన్నేం చేయగలరు?
[12] దేవా, నీవు మరణంనుంచి నన్ను తప్పించావు, నా అడుగులు తడబడకుండా కాపాడావు. జీవం వెలుగులో దేవుని ఎదుట నేను నడవగలిగేలా చేశావు.
[13] అందుచేత నీకు నేను అర్పిస్తానని మొక్కుకొన్నది నామీదే నిలిచి ఉంది. నేను నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను.