Skip to content
Opens in a new window

[1] యెహోవా మంచివాడు, ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోండి.

[2] “ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది” అంటూ ఇస్రాయేల్‌ప్రజ చెప్పుకోవాలి.

[3] “ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది” అంటూ అహరోను వంశీకులు చెప్పుకోవాలి.

[4] “ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది” అంటూ యెహోవాపట్ల భయభక్తులు గలవారంతా చెప్పుకోవాలి.

[5] ఇరుకులో ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. యెహోవా నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలో ఉంచాడు.

[6] యెహోవా నా పక్షాన ఉన్నాడు. నాకు భయం ఉండదు. మనుష్యమాత్రులు నాకేమి చేయగలరు?

[7] యెహోవా నా పక్షాన ఉండి నాకు సహాయం చేస్తున్నాడు. అందుచేత నా పగవాళ్ళ విషయంలో నేను కోరినదే జరగడం చూస్తాను.

[8] మనుషుల మీద నమ్మకం పెట్టడం కంటే యెహోవాను నమ్మి ఆశ్రయించడం మంచిది.

[9] రాజులమీద నమ్మకం పెట్టడంకంటే యెహోవాను నమ్మి ఆశ్రయించడం మంచిది.

[10] ఇతర జనాలన్నీ నన్ను చుట్టుముట్టినా, యెహోవా పేర నేను వాళ్ళను నాశనం చేస్తాను.

[11] నలువైపుల నుంచీ వాళ్ళు నన్ను చుట్టుముట్టినా సరే యెహోవా పేర వాళ్ళను నాశనం చేస్తాను.

[12] కందిరీగల్లాగా నా చుట్టూరా వాళ్ళు ముసురుకొన్నా సరే ముండ్లకంప మంటలాగా తృటిలో ఆరిపోతారు. యెహోవా పేర నేను వాళ్ళను నాశనం చేస్తాను.

[13] నన్ను బలంగా గెంటివేయడం జరిగింది. నేను పడిపోయి ఉండవలసిందే గానీ యెహోవా నాకు సహాయం చేశాడు.

[14] యెహోవా నా బలం, నా గానం. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.

[15] న్యాయవంతుల నివాసాలలో ఆనందభరితమైన విజయ ధ్వనులు వినబడుతాయి. యెహోవా కుడిచేయి పరాక్రమ క్రియలు సాధిస్తుంది.

[16] యెహోవా కుడి చెయ్యి పైన ఉంటుంది. యెహోవా కుడిచెయ్యి పరాక్రమ క్రియలు సాధిస్తుంది.

[17] నేను చావను. నేను బ్రతికి ఉంటాను, యెహోవా క్రియలు ప్రకటిస్తాను.

[18] యెహోవా నన్ను ఎంతో కఠినమైన క్రమశిక్షణకు గురి చేశాడు. కానీ ఆయన నన్ను చావుకు అప్పగించలేదు.

[19] నీతిన్యాయాల ద్వారాలు తెరవండి. నేను వాటిగుండా లోపల ప్రవేశిస్తాను, యెహోవాకు కృతజ్ఞతలు అర్పిస్తాను.

[20] ఇది యెహోవా గుమ్మం. న్యాయవంతులు దీనిద్వారా ప్రవేశిస్తారు.

[21] నీవు నాకు జవాబిచ్చావు, నీవు నాకు రక్షణ అయ్యావు. గనుక నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను.

[22] కట్టేవాళ్ళు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.

[23] ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.

[24] ఇది యెహోవా నెలకొల్పిన రోజు. ఈ రోజు మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం.

[25] యెహోవా! మమ్మల్ని రక్షించు. ఇదే నా విన్నపం. యెహోవా! మాకు వృద్ధి దయ చెయ్యి.

[26] యెహోవా పేరట వచ్చేవాడు ధన్యజీవి. యెహోవా ఆలయం నుంచి మిమ్మల్ని దీవిస్తాం.

[27] యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు ప్రసాదించాడు. మహోత్సవ బలి పశువును తాళ్ళతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.

[28] నీవే నా దేవుడివి. నీకే కృతజ్ఞతలు అర్పిస్తాను. నీవే నా దేవుడివి. నిన్నే ఘనపరుస్తాను.

[29] యెహోవా మంచివాడు. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోండి.

కీర్తనలు — Chapters