Skip to content
Opens in a new window

[1] యెహోవా, కోపించి నన్ను శిక్షించకు. ఆగ్రహించి నన్ను దండించకు.

[2] యెహోవా, నా మీద దయ చూపు; నేను నీరసించిపొయ్యాను. యెహోవా, నాకు ఎముకల్లో బాధగా ఉంది. నా మనసులో ఎంతో వేదన ఉంది. నాకు ఆరోగ్యం ప్రసాదించు.

[3] యెహోవా, ఎంతకాలమని నీవిలా ఊరుకొంటావు?

[4] యెహోవా, మళ్ళీ రా! నాకు విముక్తి ప్రసాదించు. నీ వాత్సల్యంతో నన్ను రక్షించు.

[5] చనిపోయిన వాళ్ళకు నీ గురించి జ్ఞాపకం ఉండదు. మృత్యులోకంలో నీకు కృతజ్ఞత అర్పించేదెవరు?

[6] నేను మూలిగి మూలిగి నీరసించిపోయాను. రాత్రంతా నా కన్నీళ్ళతో నా పరుపు నానిపోతుంది. నా బాష్పాలతో నా పడక మునిగిపోతుంది.

[7] శోకంతో నా కళ్ళు గుంటలు పడుతున్నాయి. నా శత్రువుల మూలంగా నా కళ్ళు క్షీణించాయి.

[8] నా ఏడుపు యెహోవా ఆలకించాడు. దుర్మార్గులైన మీరంతా నాదగ్గర నుంచి పోండి!

[9] యెహోవా నా విన్నపం ఆలకించాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు.

[10] నా శత్రువులంతా సిగ్గుపాలవుతారు. వాళ్ళు భయంతో గడగడ వణుకుతారు. వాళ్ళు ఆకస్మికంగా వెనక్కు తిరిగి సిగ్గుపాలవుతారు.

కీర్తనలు — Chapters