[1] దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు. వాళ్లు భ్రష్టులు. నీచ కార్యాలకు ఒడికట్టేవాళ్ళు మంచి చేసేవాడు ఒక్కడూ లేడు.
[2] యెహోవా పరలోకం నుంచి మనుషులను పరిశీలనగా చూశాడు. జ్ఞాన దృష్టితో ప్రవర్తించేవారెవరైనా ఉన్నారా అని, దేవుణ్ణి వెదికేవారెవరైనా ఉన్నారా అని ఆయన చూశాడు.
[3] వాళ్ళంతా త్రోవ తప్పినవాళ్ళు. అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు. మంచి చేసేవాడు లేడు, ఒక్కడూ లేడు.
[4] చెడుగు చేసే వాళ్ళంతా గ్రహించరేమిటి! వాళ్ళు యెహోవాకు ప్రార్థన చేయరు. పైగా నా ప్రజలను ఆహారం మింగినట్టే దిగమ్రింగివేస్తారు.
[5] అయితే వాళ్ళకు చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు యథార్థవంతుల పక్షంగా ఉన్నాడు.
[6] దీనావస్థలో ఉన్న భక్తుల సమాలోచనలు మీరు భంగం చేయడానికి చూస్తారు. అయితే యెహోవా వారికి ఆశ్రయం!
[7] అహో, సీయోనులో నుంచి ఇస్రాయేల్‌ప్రజకు రక్షణ కలుగుతుంది గాక! యెహోవా తన జనానికి క్షేమస్థితిని మళ్ళీ కలిగించేటప్పుడు యాకోబు ప్రజ ఆనందిస్తారు, ఇస్రాయేల్‌ప్రజ సంతోషిస్తారు.