[1] నా మనసా, యెహోవాను కీర్తించు. యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడివి! వైభవం, తేజస్సు ధరించుకొన్న వాడివి!
[2] వెలుగును వస్త్రంలాగా కప్పుకొని ఉన్నావు నీవు. తెరలాగా ఆకాశాలను పరచి ఉన్నావు.
[3] వాటి జలాలలో తన మేడగదుల దూలాలు వేసి ఉంచాడాయన. ఆయన మేఘాలను రథంగా చేసుకొంటాడు. గాలి రెక్కలమీద ప్రయాణం చేస్తాడు.
[4] తన దూతలను గాలివంటివారుగా, తన సేవకులను మంటలవంటివారుగా చేసుకొనేవాడు.
[5] ఆయన భూమిని దాని పునాదులమీద సుస్థిరం చేశాడు. అది ఎన్నడూ దాని స్థానంనుంచి తప్పిపోకుండా చేశాడు.
[6] దేవా, నీవు భూమిమీద జలాగాధాన్ని దుస్తులలాగా కప్పావు. కొండల మీద నీళ్ళు నిలిచాయి.
[7] నీ మందలింపుకు నీళ్ళు పారిపొయ్యాయి. నీ ఉరుముల స్వరం విని అవి త్వరత్వరగా పలాయనం అయ్యాయి.
[8] పర్వతాలు ఎక్కుతూ, పల్లాలకూ దిగుతూ, వాటికి నీవు నిర్ణయించిన చోట్లకు అవి వెళ్ళాయి.
[9] వాటికి నీవు సరిహద్దులను నియమించావు. అవి సరిహద్దులను దాటవు. అవి మళ్ళీ వచ్చి భూమిని కప్పివేయవు.
[10] యెహోవా లోయలలో ఊటలను పుట్టిస్తున్నాడు. కొండలమధ్య అవి ప్రవహిస్తాయి.
[11] అవి అడవి మృగాలన్నిటికీ దప్పి తీరుస్తున్నాయి. వాటివల్ల అడవిగాడిదెలు దాహం తీర్చుకుంటాయి.
[12] గాలిలో ఎగిరే పక్షులకు ఆ వాగులకు పైగా ఉనికిపట్టు ఉంటుంది. కొమ్మలమధ్య అవి గొంతెత్తి పాడుతున్నాయి.
[13] తన మేడ గదులలో నుంచి ఆయన కొండలను తడుపుతాడు. దేవా, నీ క్రియకు ఫలితంగా భూమికి తృప్తి కలుగుతుంది.
[14] పశువులకు గడ్డి, మనుషుల ఉపయోగానికి కూరమొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. తద్వారా భూసారంలో నుంచి మనిషికి ఆహారం కలుగజేస్తున్నాడు.
[15] మనిషికి హృదయానందం కలిగించే ద్రాక్షరసం, వాళ్ళ ముఖాలకు ప్రకాశం కలిగించే నూనె, గుండె బలం చేకూర్చే ఆహారం ఆయన ఇస్తున్నాడు.
[16] యెహోవా చేసిన వృక్షాలు సంతృప్తిగా ఉన్నాయి. ఆయన నాటిన లెబానోన్‌దేవదారు చెట్లు సంతుష్టిగా ఉన్నాయి.
[17] పక్షులు అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి. సరళ వృక్షాల మీద కొంగలు నివాసం ఏర్పరచుకొంటాయి.
[18] ఎత్తైన కొండలలో అడవి మేకపోతులు ఉంటాయి. కుందేళ్ళు బండ సందుల్లో దాగుకొంటాయి.
[19] ఋతువులను చంద్రగోళం సూచిస్తుంది. ప్రొద్దు క్రుంకవలసిన సమయమేదో తనకు తెలుసు.
[20] నీవు చీకటి చేయబట్టే రాత్రి కలుగుతుంది. రాత్రిపూట అడవి మృగాలు తిరుగాడుతాయి.
[21] సింహం పిల్లలు వేట మాంసం కోసం గర్జిస్తాయి. తమ ఆహారం దేవుని దగ్గరనుంచి వెదకుతాయి.
[22] ప్రొద్దు పొడవడంతోనే అవి తమ గుహలకు తిరిగి వెళ్ళి పడుకుంటాయి.
[23] అప్పుడు మనుషులు సాయంకాలం వరకు శ్రమించి పని చేసేందుకు బయలుదేరుతారు.
[24] యెహోవా, నీ కార్యకలాపాలు ఎన్నో ఉన్నాయి! జ్ఞానంతో నీవు వాటన్నిటినీ చేశావు. నీవు నిర్మించిన వాటితో భూమి నిండిపోయింది.
[25] అదుగో మహా సముద్రం. అదెంతో విశాలం! అందులో పెద్దవీ చిన్నవీ లెక్క పెట్టలేనన్ని జీవరాసులు ఉన్నాయి.
[26] అందులో ఓడలు కదిలిపోతున్నాయి. అందులో క్రీడించేందుకు నీవు నిర్మించిన బ్రహ్మాండమైన ప్రాణులు ఉన్నాయి.
[27] సరైన వేళకు నీవు వాటికి తిండి పెట్టాలని అవన్నీ నీ వైపు ఆశతో చూస్తాయి.
[28] నీవు వాటికి ఆహారం ఇస్తే, అవి సమకూర్చుకొంటాయి. నీవు గుప్పిలి విప్పితే, అవి మంచి పదార్థాలతో తృప్తి చెందుతాయి.
[29] నీ ముఖం కనబడకుండా నీవు చేస్తే, అవి భయంతో వణుకుతాయి. వాటి ప్రాణం తీసుకొన్నప్పుడు అవి అంతరించి పోతాయి. మట్టి పాలవుతాయి.
[30] నీ ఆత్మను పంపినప్పుడు అవి ఉనికిలోకి వస్తాయి. నీవు భూతలాన్ని నవనూతనం చేస్తావు.
[31] యెహోవా ఘనత శాశ్వతంగా ఉంటుంది. యెహోవా తన క్రియాకలాపాలలో ఆనందిస్తాడు.
[32] ఆయన భూమివైపు చూస్తే చాలు, అది కంపించిపోతుంది. ఆయన కొండలను తాకితే చాలు, అవి పొగలు వెళ్లగ్రక్కుతాయి.
[33] నేను బ్రతికి ఉన్నంతకాలం యెహోవాకు పాటలు పాడుతాను. నాకు ఉనికి ఉన్నంతవరకూ నా దేవునికి స్తుతిగానం చేస్తాను.
[34] ఆయనను గురించిన నా ధ్యానం ఆయనకు సంతోషకరంగా ఉంటుంది. నేను యెహోవాను బట్టి ఆనందిస్తాను.
[35] పాపాత్ములు భూమిమీద లేకుండా పోతారు గాక! దుర్మార్గులు నాశనమైపోతారు గాక! యెహోవాను కీర్తించు, నా మనసా! యెహోవాను కీర్తించు!