Skip to content
Opens in a new window

[1] యెహోవా, నా ప్రార్థన విను. నా మొర నీకు చేరనియ్యి.

[2] నేను కష్టంలో ఉన్న రోజు నీ ముఖం నాకు కనబడకుండా చేయబోకు. నా ఆక్రందన చెవిని బెట్టి, నేను మొరపెట్టే రోజు నాకు శీఘ్రంగా జవాబివ్వు.

[3] నా రోజులు పొగలాగా హరించుకుపోతున్నాయి. పొయ్యిలో నా ఎముకలు కాలిపోతున్నాయా అనిపిస్తుంది.

[4] నా గుండె ఎండకు వాడిపోయిన గడ్డిలాంటిది. భోం చెయ్యాలనే సంగతే మరిచిపోతాను.

[5] నేను స్వరమెత్తి మూలుగుతూ ఉన్నందుచేత నా ఎముకలు కనబడేటంతగా నా శరీరం చిక్కిపోయింది.

[6] నేను అడవిబాతులాంటివాణ్ణి. శిథిల ప్రదేశాలలోని గుడ్లగూబలాగా ఉన్నాను.

[7] రాత్రంతా మెళుకువగా ఉన్నాను. ఇంటికప్పు మీద ఉన్న ఒంటరి పిచ్చుకలాగా ఉన్నాను నేను.

[8] రోజంతా నా శత్రువులు నన్ను ఆడిపోసుకుంటున్నారు. నన్ను వెర్రిగా దూషించే వాళ్ళు నా పేరెత్తి శపిస్తారు.

[9] నీ కోపాగ్ని బట్టి, నీ ఆగ్రహం బట్టి నేను బూడిదను ఆహారంగా తింటున్నాను.

[10] నా పానీయం కన్నీళ్ళతో కలుపుతున్నాను. నీవు నన్ను పైకెత్తి అవతల పారవేశావు.

[11] నా రోజులు సాయంకాలం నీడలాగా ఉన్నాయి. నేను గడ్డిలాగా వాడిపోతున్నాను.

[12] యెహోవా, నీవు శాశ్వతంగా రాజువై ఉంటావు. అన్ని తరాలవారు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు.

[13] నీవు లేచి సీయోను నగరాన్ని కనికరిస్తావు. నీవు దానిమీద దయ చూపవలసిన సమయం రానే వచ్చింది. ఇది నిర్ణీత కాలం.

[14] దాని రాళ్ళంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని మట్టిని జాలితో చూస్తారు.

[15] ఇతర ప్రజలు యెహోవా పేరుకు భయపడుతారు. భూరాజులంతా నీ వైభవానికి భయపడుతారు.

[16] ఎందుకంటే, యెహోవా సీయోన్ను మళ్ళీ కట్టించినప్పుడు తన వైభవంలో ప్రత్యక్షం అవుతాడు.

[17] దిక్కుమాలిన దరిద్రుల ప్రార్థన వైవు ఆయన మొగ్గుతాడు. వారి ప్రార్థన ఆయన నిరాకరించడు.

[18] రాబోయే తరాలకు ఇలా రాసిపెట్టి ఉంటుంది – ఉనికి లోకి రాబోయే ప్రజ యెహోవాను స్తుతిస్తారు:

[19] “బందీల మూలుగులు వినడానికి, చావుకు నియమించబడ్డవారికి విడుదల ప్రసాదించడానికి

[20] యెహోవా ఎత్తయిన తన పవిత్ర స్థలం నుంచి కిందికి వంగాడు. పరలోకంనుంచి భూమిని చూశాడు.”

[21] ఆ విధంగా మనుషులు సీయోనులో యెహోవా పేరుప్రతిష్ఠలు వివరిస్తారు, జెరుసలంలో ఆయన కీర్తి ప్రకటిస్తారు.

[22] అప్పుడు యెహోవాకు సేవ చేయడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడి ఉంటారు.

[23] నా మార్గం మధ్యలో ఆయన నా బలం నీరసించేలా చేశాడు. నా రోజులు ఆయన తక్కువ చేశాడు.

[24] నేనిలా వేడుకొన్నాను: “నా దేవా, నా రోజుల మధ్యలో నన్ను తీసుకుపోవద్దు. నీ సంవత్సరాలు తరతరాలుగా సాగుతాయి.

[25] ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు. ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే.

[26] అవి అంతరించిపోతాయి. నీవైతే ఉంటావు. అవి అన్నీ వస్త్రంలాగా పాతబడిపోతాయి. నీవు వాటిని దుస్తుల్లాగా మార్చివేస్తావు, అవి మార్చబడుతాయి.

[27] కాని, నీవు ఒకే తీరున ఉంటావు. నీ సంవత్సరాలకు అంతం ఉండదు.

[28] నీ సేవకుల పిల్లలు నీ సమక్షంలో నివాసం చేస్తారు, వారి వంశం సుస్థిరంగా ఉంటుంది.

కీర్తనలు — Chapters